మహీంద్రా చేతికి ప్యూజో మోటోసైకిల్స్ | Sakshi
Sakshi News home page

మహీంద్రా చేతికి ప్యూజో మోటోసైకిల్స్

Published Wed, Oct 8 2014 1:06 AM

మహీంద్రా చేతికి ప్యూజో మోటోసైకిల్స్

 51% వాటా కొనుగోలుకు ఒప్పందం  
 డీల్ విలువ రూ. 217 కోట్లు


ముంబై: ఆటోమొబైల్ సంస్థ  ప్యూజో  మోటోసైకిల్స్‌లో 51 శాతం వాటాలను దేశీ దిగ్గజం మహీంద్రా టూ వీలర్స్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు 28 మిలియన్ యూరోలు (దాదాపు రూ. 217 కోట్లు). ఇందుకు సంబంధించిన ఒప్పందంపై మంగళవారం ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఫ్రాన్స్‌కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం పీఎస్‌ఏ గ్రూప్‌లో ప్యూజో  మోటోసైకిల్స్ భాగం. తాజా బైండింగ్ ఒప్పందం ప్రకారం వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే దిశగా మహీంద్రా టూ వీలర్స్ సంస్థ.. ముందుగా  ప్యూజోలో 15 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేస్తుంది. తదుపరి మరో 13 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేస్తుంది.

ఇతరత్రా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి డీల్ మూడు నెలల్లోగా పూర్తి కావొచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. రెండేళ్ల పాటు ఎటువంటి పునర్‌వ్యవస్థీకరణ చర్యలు ఉండవని, ఇప్పుడున్న మేనేజ్‌మెంట్ బృందాన్నే కొనసాగించనున్నట్లు తెలిపారు. ఎంఅండ్‌ఎంతో ఒప్పందం తమ కార్యకలాపాల విస్తరణకు దోహదపడగలదని ప్యూజో స్కూటర్స్ ఎండీ ఫ్రెడరిక్ ఫేబర్ పేర్కొన్నారు. దాదాపు 116 ఏళ్ల చరిత్ర గల  ప్యూజో  యూరప్‌లో ద్విచక్ర వాహనాలు, కార్ల తయారీకి పేరొం దింది. ప్రస్తుతం కంపెనీ ద్విచక్రవాహనాల విభాగం నష్టాల్లో ఉంది. మరోవైపు, కొన్నాళ్ల క్రితమే ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన ఎంఅండ్‌ఎం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, మంగళవారం ఎంఅండ్‌ఎం షేరు బీఎస్‌ఈలో 2.3% నష్టంతో రూ. 1,359 వద్ద క్లోజైంది.

Advertisement
Advertisement