మూఢనమ్మకాల ఆధారంగా అసెంబ్లీ రద్దు...

10 Oct, 2018 02:35 IST|Sakshi

గవర్నర్‌ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి

హైకోర్టును కోరిన పిటిషనర్‌ కొమిరెడ్డి రాంచందర్‌

నేడు విచారించనున్న ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి మండలి సిఫార్సు మేరకు అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ న్యాయవాది కొమిరెడ్డి రాంచందర్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందు లో ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి, ప్రధాన ఎన్నికల అధికారి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

అసెంబ్లీ రద్దుకు గల కారణాలు కేసీఆర్‌ వెల్లడించలేదని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా రద్దు జరిగిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజనాల ఆధారంగా కాకుండా మూఢనమ్మకాలు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రాలపై ఉన్న నమ్మకాల ఆధారంగా అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రద్దు సీఎం వ్యక్తిగత నిర్ణయం. ఈ నిర్ణయానికి ముందు ఆయన అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోలేదు. మం త్రి మండలి ఉమ్మడి నిర్ణయం కూడా కాదు. కేసీఆర్‌ ఎప్పుడో నిర్ణయం తీసేసుకుని నిబంధనల ప్రకారం ఆమోదం కోసం ఏదో మొక్కుబడి మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. 6వ నంబర్‌పై ఉన్న నమ్మకం కొద్దీ మంత్రి మండలి సమావేశాన్ని సెప్టెం బర్‌ 6న నిర్వహించారు.

105 మందికి టికెట్లు ప్రకటించారు. శాసనసభ రద్దు విషయంలో గవర్నర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చు. పరిస్థితుల ను బట్టి రాష్ట్రపతి పాలనకు సైతం గవర్నర్‌ సిఫార్సు చేయవచ్చు. లోక్‌సభ ఎన్నికలు 2019 మేలో జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ రద్దుపై పునరాలోచన చేయాలని గవర్నర్‌ మంత్రి మండలిని కోరి ఉండొ చ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్‌ ఆమోదం తెలపడం అప్రజాస్వామికం. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం హడావుడిగా తయారు చేస్తోంది. అర్హులైన చాలా మందికి ఓటర్ల జాబితాలో స్థానం కల్పించలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించం డి’ అని కోర్టును పిటిషనర్‌ అభ్యర్థించారు.

మరిన్ని వార్తలు