హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు బిగ్‌ రిలీఫ్‌..

10 Oct, 2023 11:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్‌ వేసిన పిటిషన్‌ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. 

వివరాల ప్రకారం.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అయితే, 2018లో శ్రీనివాస్‌ గౌడ్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు పిటిషన్‌ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పులను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పును వెలువరించింది.

ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు పెద్ద ఊరట లభించింది. మంత్రికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న(సోమవారం) ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్‌ 30వ తేదీన ఎన్నికలకు కౌంటిగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 

ఇది కూడా చదవండి: ఎన్నికల తేదీలు వచ్చాయో లేదో.. ఇటు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల సర్వేల లొల్లి

మరిన్ని వార్తలు