ధారూరుకు కరోనా ముప్పు

13 Jul, 2020 06:59 IST|Sakshi
కోట్‌పల్లి ప్రాజెక్టుకు కారులో వచ్చిన పర్యాటకులు

తాండూరు, వికారాబాద్ పెద్దేముల్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కోట్‌పల్లికి తరలివస్తున్న నగరవాసులు, జిల్లా ప్రజలు

ప్రాజెక్టు నీటిలో ఈతలు, సమీప అడవిలో వనభోజనాలు

ధారూరు: ధారూరుకు కరోనా ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మండలంలో ఈ రోజు వరకు ఒక్క పాజిటవ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయితే హైదరాబాద్‌ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శని, ఆదివారాల్లో కోట్‌పల్లి ప్రాజెక్టుకు వస్తున్నారు. ప్రాజెక్టు నీటిలో ఈతలు కొడుతున్నారు. వన భోజనాలు చేసి ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. వీరిని అధికారులు నిరోధించలేకపోతున్నారు. అన్‌లాక్‌ ప్రక్రియ ఉండటంతో ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా పాజిటివ్‌ కేసులు నమోదైన పెద్దేముల్‌లో ఇప్పటికే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా, తాండూరు, వికారాబాద్‌లోనూ ఒకటి రెండు రోజుల్లో వ్యాపార సముదాయాల బంద్‌ పాటించాలని వాణిజ్యవర్గాలు తీర్మానించాయి.

ఆయా గ్రామాల మధ్య ఉన్న ధారూరులో వారాంతపు సంత కొనసాగుతోంది. దీనికి వికారాబాద్, యాలాల, పెద్దేముల్, కోట్‌పల్లి, పరిగి తదితర మండలాల నుంచి వాపారులు, కూరగాయల రైతులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. పక్క మండలాల్లో లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో వినియోగదారులు ధారూరు సంతకు భారీగా వచ్చే అవకాశముంది. వీరిలో ఎవరికి కరోనా ఉందో.. ఎవరికి లేదో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు ధారూరులో ఒక్క కేసు లేదు. వికారాబాద్, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నివాసం ఉంటున్న మండలానికి చెందిన ముగ్గురు ఈ వ్యాధిబారిన పడ్డారు. వినియోగదారులు ఇతర ప్రాంతాల నుంచి వస్తే మాత్రం మండలానికి కరోన వైరస్‌ వ్యాప్తి ప్రమాదం పొంచిఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ముప్పును అడ్డుకోవాలని అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు