అక్రమ కనెక్షన్లు కట్

19 Nov, 2014 02:25 IST|Sakshi

మోర్తాడ్: గడచిన ఖరీఫ్ సీజనులో విద్యుత్ కోతలతో వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కోతలు తీవ్రం కావడంతో రైతులు ఆందోళనలకు దిగారు. ప్రస్తుతం మొదలు కానున్న రబీ సీజనులోనూ వ్యవసాయానికి కరెంటు అంతంత మాత్రమే సరఫరా అయ్యే అవాశముంది. అక్రమ కనెక్షన్లను తొలగిస్తే లోడ్‌ను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామాలలోని వ్యవసాయ క్షేత్రాలలో అనుమతి లేకుండా ఉన్న కనెక్షన్లను తొలగించాలని ఎన్‌పీడీసీఎల్ ఆదేశాలిచ్చింది.

దీంతో ఏఈఈలు, సబ్ ఇంజనీర్లు, లైన్ ఇన్‌స్పెక్టర్‌లు, లైన్‌మెన్‌లు రంగంలోకి దిగనున్నారు. అక్రమ కనెక్షన్ల తొలగింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఎన్‌పీడీసీఎల్ నుంచి క్షేత్రస్థాయి అధికారులకు జారీ చేసిన మెమోలో పేర్కొంది. రబీ పనులు మొదలు కాకముందే ఈ పనులు పూర్తి కావలసి ఉంది. దీంతో తమకు గ్రామాలలో ఇబ్బందులు తలెత్తుతాయని ఉద్యోగులు చెబుతున్నారు.

 అపుడు కోతలు విధించి
 అక్రమ కనెక్షన్లతో సీజనులో రోజుకు 25 మెగావాట్ల విద్యుత్ అధికంగా వినియోగమవుతోంది. ఖరీఫ్‌లో వ్యవసాయ పనులు ఎక్కువగా సాగినపుడు రోజుకు 600మె గావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే 400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అయ్యింది. అప్పుడు గృహ అవసరాలకు, వ్యవసాయానికి కోతలు విధించి విద్యుత్‌ను సరఫరా చేశారు. అక్రమ కనెక్షన్లతో ఏర్పడిన లోడ్‌ను తగ్గిస్తే వ్యవసాయానికి కొంత మెరుగ్గా విద్యుత్‌ను సరఫరా చేసేవారమని అధికారులు చెబుతున్నారు.

 ఇప్పుడు వ్యవసాయ పనులు మందగించడం తో జిల్లాలో రోజుకు 200 మెగావాట్ల విద్యుత్ విని యోగమవుతోంది. రబీ పనులు మొదలైతే విద్యుత్ డిమాండ్ ఎక్కువ అవుతుంది. అందుకే అక్రమ కనెక్షన్ల తొలగించాలనే కఠిన నిర్ణయాన్ని యాజమాన్యం తీసుకుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు