క్రమబద్ధీకరిస్తే మంచిది!

2 Jul, 2014 01:10 IST|Sakshi
క్రమబద్ధీకరిస్తే మంచిది!

* గురుకుల్, అయ్యప్ప భూములపై తెలంగాణ ప్రభుత్వం యోచన
* మార్కెట్ రేటుతో ఖజానాకు ఆదాయం.. వివాదాలకు ఫుల్‌స్టాప్..!
* అధికారుల ప్రతిపాదనలపై సర్కారు దృష్టి

సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ట్రస్ట్, అయ్యప్ప సొసైటీల్లోని భూముల ఆక్రమణలకు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వందల ఎకరాలు ఆక్రమణకు గురై అనధికార నిర్మాణాలు ఇప్పటికే పూర్తవడం, కొన్ని నిర్మాణంలో ఉన్న విషయం విదితమే. వీటిని ప్రస్తుత మార్కెట్ ధరకు క్రమబద్ధీకరిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తద్వారా ఖజానాకు ఆదాయం రావడంతోపాటు, వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లు అవుతుందని అధికారులు ప్రభుత్వానికి సూచిం చినట్లు తెలిసింది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ధరలకు కాకుండా ప్రస్తుత మార్కెట్ ధరలకు ఆక్రమణదారులకు అప్పగిస్తే భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అధికారవర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చేయడం ద్వారా ఇకపై కబ్జాలకు పాల్పడితే సహించేది లేదన్న సంకేతాలు ఇవ్వగలిగామని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి, నిర్మాణాలు పూర్తయి ఆ భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటిని కూల్చడం సాధ్యమయ్యే పనికాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

విద్యుత్, మంచినీరు మూడు రెట్లు ఛార్జీలు కొనసాగిస్తూనే క్రమబద్దీకరణకు ఒక గడువు పెట్టాలని ప్రతిపాదించారు. చెరువుల పరిరక్షణలో మాత్రం పూర్తి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అన్యాక్రాంతమైన భూములపై సర్వేను అధికారవర్గాల ఇదివరకే చేపట్టాయి.

స్థలాలు అన్యాక్రాంతం అయినచోట వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అలాంటి భూములను పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించుకోవడం, అవసరమైనచోట గృహ నిర్మాణం, ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. భవన నిర్మాణాలు వచ్చినచోట మాత్రమే క్ర మబద్ధీకరణపై దృష్టి సారించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు