శ్రీశైలానికి ఆగని వరద

15 Aug, 2018 01:44 IST|Sakshi

  95 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  తుంగభద్రకు లక్ష క్యూసెక్కుల నీరు

  గోదావరికి తగ్గిన వరద  

సాక్షి, హైదరాబాద్‌: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌కు వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. రెండ్రోజుల క్రితంతో పోలిస్తే ఈ రెండు ప్రాజెక్టులకు 70 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం పెరిగింది. ఆల్మట్టిలోకి మంగళవారం సాయంత్రం 95,680 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరగా, 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌కు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 92,680 క్యూసెక్కులు దిగువకు వదిలారు.

మరో పక్క తుంగభద్రకు రెండ్రోజుల కిందటి వరకు 60వేల క్యూసెక్కుల వరద రాగా, అది మరోమారు పుంజుకొని 1.12 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండి ఉండటంతో అక్కడి నుంచి 1.18లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఇక రాష్ట్ర పరిధిలోని జూరాలకు 35 వేల క్యూసెక్కులు వస్తుండగా, 50 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. జూరాల నీటికితోడు తుంగభద్ర నుంచి వస్తున్నప్రవాహాలతో శ్రీశైలానికి 95,680 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగానూ 150.81 టీఎంసీల నిల్వలున్నాయి. దిగువ నాగార్జునసాగర్‌ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 64,449 క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్‌లోకి 17,226 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మట్టం 312 టీఎంసీలకు గానూ 153.69 టీఎంసీలకు చేరింది.  

గోదావరిలో తగ్గిన ప్రవాహం.. : ఇక గోదావరిలో ప్రవాహాలు తగ్గిపోయాయి. ఎల్లంపల్లిలో నిన్నమొన్నటి వరకు భారీ ప్రవాహాలురాగా, మంగళవారం 15,719 క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగానూ 19.04 టీఎంసీల నిల్వ ఉంది. ఇక కడెంలోకి 2,366 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎస్సారెస్పీలోకి 2,300 క్యూసెక్కులు వస్తుండగా నిల్వ 90 టీఎంసీలకు గానూ 16.91 టీఎంసీలకు చేరింది. సింగూరు, నిజాంసాగర్, ఎల్‌ఎండీల్లోకి ఎలాంటి ప్రవాహాలు నమోదు కావడం లేదు.

>
మరిన్ని వార్తలు