ఆలోచనలు మారి..అంతరాలు తగ్గి.. 

25 Sep, 2018 01:38 IST|Sakshi

     పెరుగుతున్న కులాంతర వివాహాలు 

     ప్రోత్సాహకాలు ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ శాఖలు 

     ఏటా కనిష్టంగా 2 వేల దరఖాస్తులు..

సాక్షి, హైదరాబాద్‌ : ఆలోచనలు మారుతున్నాయి. అంతరాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు పెళ్లికి ప్రధానంగా పరిగణించే కులం ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపడంలేదు. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడు తున్న ఈ తరుణంలో సామాజికంగా వస్తున్న మార్పులు పెళ్లి సంబంధాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కులాగోత్రాలు చూసి బంధాలు కలుపుకోవడం కన్నా వృత్తులు, ఆర్థిక అంశాలే ప్రధానమవుతు న్నాయి. మారుతున్న పని విధానంతో ప్రేమ పెళ్లిళ్లు సహజమవుతున్నాయి. దీంతో కులాంతర పెళ్లిళ్ల సం ఖ్య పెరుగుతోంది. గతంలో నూటికొకటి వంతున జరిగే కులాంతర వివాహాలు... ఇప్పుడు 8కి పెరిగాయని ఓ సంస్థ నిర్వహించిన పరిశీలనలో తేలింది.  

మూడు రెట్లు పెరిగిన వివాహాలు... 
రాష్ట్రంలో గత పదేళ్ల క్రితం నాటితో పోలిస్తే కులాంతర వివాహాల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు పెళ్లి సంబంధాలు కుదిర్చే ఓ సంస్థ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ప్రతీ వంద పెళ్లిళ్లలో ఎనిమిది కులాంతర వివాహాలు జరుగుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో జరిపిన ఓ పరిశీలనలో గుర్తించారు. ఇందులో పావు వంతు ఒకే సామాజిక వర్గానికి చెందినవే. కులాంతర వివాహాల్లో ఎస్సీ, ఎస్టీల సంఖ్య అధికంగానే ఉంటోంది. గత నాలుగేళ్ల గణాంకాలు పరిశీలిస్తే కులాంతర వివాహాలు చేసుకుంటున్న ఎస్సీల సంఖ్య 2వేల వరకు ఉంది. ఈ గణాంకాలు అధికారికమే అయినప్పటికీ... వీటి సంఖ్య రెట్టింపు ఉంటుందని, ఎస్టీల్లో మాత్రం ఈ సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

కేంద్రం నుంచి భారీ ప్రోత్సాహకం... 
కులాంతర వివాహాలు చేసుకున్న దళిత, గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ అయితే ఆ జంటకు గతంలో రూ.50వేలు ఇచ్చేది. తాజాగా ఈ ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం 2018–19 సంవత్సరం నుంచి రూ.2.5లక్షలకు పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలి. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. మరోవైపు పేదింటిలో ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని రాష్ట్రం అమలు చేస్తోంది. ఈ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకం కులాలతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా అమలు చేస్తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఈ రెండు పథకాలతోనూ లబ్ధి చేకూరనుంది.  

మరిన్ని వార్తలు