ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు

27 Aug, 2023 03:42 IST|Sakshi

చేవెళ్ల సభలో 12 హామీలతో కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ 

అంబేడ్కర్‌ అభయ హస్తం కింద రూ.12 లక్షల ఆర్థిక సాయం 

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, ప్రైవేటు విద్యాసంస్థలు, కంపెనీల్లోనూ రిజర్వేషన్లు 

టెన్త్‌ నుంచి పీహెచ్‌డీ దాకా పాసైన ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం 

చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. 

డిక్లరేషన్‌లోని అంశాలివీ.. 

  • జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. 
  • అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. 
  • ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు 
  • ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. 
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్‌ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్‌ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. 
  • ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. 
  • సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. 
  • ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్‌ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. 
  • గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్‌ సేవాలాల్‌ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్‌ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. 
  • రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు. 
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్‌ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. 
  • ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం.   
మరిన్ని వార్తలు