ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన కేసీఆర్‌ 

27 Aug, 2023 03:11 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ పాలనలో వారిపై దాడులు పెరిగాయి: పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి 

గులాబీ ఎమ్మెల్యేల అవినీతికి అదుపులేకుండా పోయిందని విమర్శ 

తొమ్మిదిన్నరేళ్లలో లక్ష కోట్ల ఆస్తులు.. పదివేల కోట్ల భూములను ఆక్రమించారని ఆరోపణ

సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/ మొయినాబాద్‌: బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని.. పైగా వారిపై దాడులు మరింతగా పెరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దళిత సీఎం అని చెప్పి, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని.. గిరిజనులకు పోడు భూములు దక్కలేదని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అవినీతికి, అక్రమ సంపాదనకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని.. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.లక్ష కోట్ల ఆస్తులను, రూ.పదివేల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. చేవెళ్ల వేదికగా శనివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఆయన 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించారు. అనంతరం మాట్లాడారు. 

మూడో విజయం తెలంగాణలోనే.. 
మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్‌ తొలి విజయం హిమాచల్‌ప్రదేశ్‌లో, రెండో విజయం కర్ణాటకలో సాధించిందని.. మూడో విజయం తెలంగాణలో సాధించబోతోందని రేవంత్‌ చెప్పారు. తమ ప్రభుత్వంలో స్వేచ్ఛతోపాటు సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు.

తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలనలో అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని.. మంత్రి వర్గంలో బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదని రేవంత్‌ విమర్శించారు. రాష్ట్రంలో 50శాతం జనాభా ఉన్న బీసీలకు మూడే మంత్రి పదవులతో సరిపెట్టార న్నారు. దేశంలోని మోదీ, తెలంగాణలోని కేసీఆర్, పాతబస్తీలోని అసదుద్దీన్‌ ముగ్గురూ ఒక్కటేనని.. వీరిలో ఎవరికి ఓటేసినా కేసీఆర్‌కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అమర వీరుల కుటుంబాలకు, తెలంగాణ పోరాట యోధులకు, ఉస్మానియా విద్యార్థులకు, తెలంగాణ వాదులకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ అవినీతి, అణచివేత, కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిందేనన్నారు.

కాగా.. ప్రజా గర్జన సభలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, గడ్డం ప్రసాద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి: దామోదర 
తెలంగాణలో భూమి కోసం, హక్కులకోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని.. అది గుర్తించే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇందిరాగాంధీ 25 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. కానీ బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనలో పేదల భూములను గుంజుకుని, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో దొర అహంకారం మితిమీరిందని.. కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. 

రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే పదవులు: సీతక్క 
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ దళితులకు ఏదో చేసిందని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప.. చేసిందేమీ లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. వందల ఎకరాల భూములు, ఫాంహౌస్‌లు ఉన్న పెద్దలకే రైతుబంధు సొమ్ము ఎక్కువగా అందుతోందని.. భూమి లేని పేదలకు ఈ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజలకు ఆత్మగౌరవం, సమానత్వం లభిస్తాయన్నారు.   

ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌ చరిత్రాత్మకం: భట్టి 
రాష్ట్ర సంపదలో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించిందని.. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎల్పినేత భట్టి విక్రమార్క చెప్పారు. చేవెళ్ల నుంచి నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేతగా పాదయాత్ర చేపట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని.. అదే సీఎల్పీ నేతగా తాను చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానని వివరించారు.

వాటిపై కాంగ్రెస్‌ పెద్దలంతా చర్చించి పేదలకు ఇంటి స్థలం, భూమి, ఆర్థిక సాయం అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ తీసుకొచ్చారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్‌.. ఆ హామీ నెరవేర్చకపోగా, పేదలకిచ్చిన లక్షల ఎకరాల భూములను వెనక్కి తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకిచ్చిన భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని.. లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు