ఇక ‘పంచాయతీ’ ఎన్నికలకు వేళాయె !

10 Dec, 2018 12:31 IST|Sakshi
పంచాయతీ కార్యాలయం ఆవరణలో బీసీ ఓటరు జాబితాను పరిశీలిస్తున్న యువతి

గ్రామ పంచాయతీ ఎన్నికలకు వేళాయె 

ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసిన అధికారులు

పంచాయతీల్లో బీసీ ఓటర్ల జాబితా పదర్శన

12వ తేదీ వరకు ఫిర్యాదుల స్వీకరణ 

15న తుది జాబితా ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల హడావుడి తగ్గనే లేదు. అప్పుడే పంచాయతీ ఎన్నికపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు రాకపోయి ఉంటే ఈ సమయానికి పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవి. కానీ ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారుల సమాచారం మేరకు డిసెంబర్‌ 25వ తేదీలోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. జనవరి 15లోగా పంచాయతీ ఎన్నికలు  పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఎన్నికల కసరత్తులో నిమగ్నమయ్యారు. అక్టోబర్‌లో ప్రకటించిన బీసీ ఓటరు జాబితాలో తప్పులున్నాయని కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు మళ్లీ బీసీ ఓటర్ల లెక్క తేల్చాలని ఆదేశించింది. రెండో సారి బీసీ ఓటర్లను గుర్తించిన అధికారులు ఆది, సోమవారాల్లో ఓటరు జాబితాను ప్రదర్శిస్తున్నారు. అందరి దృష్టి  ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఉంది. అది పూర్తవ్వగానే.. ఇక ‘పంచాయతీల’ వైపే దృష్టి.. 

సాక్షి, మెదక్  : పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు  ఇంకా ఒకరోజే గడువు మిగిలి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతోంది.  పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ఆగస్టుతోనే ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే పంచాయతీ అధికారులు సిద్ధం చేసిన బీసీ ఓటరు జాబితాలో తప్పులున్నాయంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం బీసీ ఓటరు గణన  మరోమారు చేపట్టి ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు మరో సారి బీసీ ఓటర్ల గణన చేపట్టారు.

అయితే ఇంతలోనే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చాయి. దీంతో బీసీ ఓటర్ల గణన ప్రక్రియ నిలిచిపోయింది.  జనవరి 15లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ తాజాగా హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు బీసీ ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పంచాయతీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ప్రక్రియలో కీలకం. ఈనెల15న బీసీ ఓటరు తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. అధికారుల సమాచారం మేరకు ఈనెల 25వ తేదీలోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్నట్లు తెలుస్తోంది. 


అభ్యంతరాల స్వీకరణ..
జిల్లాలో మొత్తం 20మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 469  పంచాయతీలు ఉన్నాయి.  ఆయా పంచాయతీల పరిధిలో 4,086 వార్డులున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కీలకమైంది. ఇందుకోసం అధికారులు ఇదివరకే ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్‌ ఓటర్లను గుర్తించి అక్టోబర్‌ 10వ తేదీన తుది ఓటరు జాబితాను సిద్ధం చేశారు. గ్రామాల వారిగా  ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించడం జరిగింది. ముసాయిదా జాబితాను అనుసరించి  జిల్లాలో 4,26, 873 మంది ఓటర్లున్నారు.

ఇందులో ఎస్సీ ఓటర్లు 76,677, ఎస్టీ ఓటర్లు 42,031, జనరల్‌ ఓటర్లు 32,886 ఓటర్లు ఉన్నారు. అలాగే బీసీ ఓటర్లు 2,75,279 మంది  ఉన్నట్లు ప్రకటించారు. బీసీ ఓటరు జాబితా రూపకల్పనలో తప్పులు చోటు చేసుకున్నట్లు పలువురు కోర్టును ఆశ్రయించడంతో మరోమారు బీసీ ఓటర్లను గుర్తించి జాబితాను ప్రకటించాలని కోర్టు ప్రకటించింది. కోర్టు ఆదేశాల మేరకు నవంబర్‌ 3వ వారంలోనే బీసీ ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది. తాజాగా అధికారులు బీసీ ఓటర్లను గ్రామాల వారిగా గుర్తించడం జరిగింది.


బీసీ ఓటర్ల ముసాదాను ఆది, సోమవారాల్లో పంచాయతీల్లో అందుబాటులో ఉంచారు. బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఏవైన ఫీర్యాదులుంటే ఈనెల12న  స్వీకరించనున్నారు. 13, 14 తేదీల్లో అభ్యంతరాలను పరిష్కరించి, 15న బీసీ ఓటరు తుది జాబితాను ప్రకటించడం జరుగుతుంది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కానుంది. బీసీ ఓటర్ల జాబితా అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం త్వరలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి.  

మరిన్ని వార్తలు