కొత్త సచివాలయం కట్టి తీరుతం

2 Nov, 2017 01:49 IST|Sakshi

శాసనసభలో తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్‌

కొత్త సచివాలయాన్ని తెలంగాణ ప్రజలకు అందించి తీరుతం

ఇంత చెత్త సచివాలయం దేశంలోనే ఎక్కడా లేదు

అడ్డదిడ్డంగా కట్టారు.. కనీసం భోజనం చేసే పరిస్థితి లేదు

అసెంబ్లీ, హెచ్‌వోడీ ఆఫీసులు, తెలంగాణ కళాభారతి కూడా కడతాం

రూ.500 కోట్లలో పూర్తి చేస్తాం..

ప్రధానితోనే పునాదిరాయి..

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లేది లేదని, సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామని చెప్పారు. దానికి పునాదిరాయిని ప్రధానితోనే వేయించి, తెలంగాణకు చారిత్రక కట్టడంగా అందించి తీరుతామన్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో కొత్త సచివాలయం అంశంపై బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు. ఇప్పుడున్న రాష్ట్ర సచివాలయం దేశంలోనే చెత్త సచివాలయమని, గత ప్రభుత్వాలు సరైన ఆలోచనతో కట్టలేదని వ్యాఖ్యానించారు. బైసన్‌పోలో గ్రౌండ్స్‌లోని 151 ఎకరాల స్థలంలో కొత్త సచివాలయంతో పాటు అసెంబ్లీ, అన్ని ప్రభుత్వ అధిపతుల కార్యాలయాలు, తెలంగాణ కళాభారతిని నిర్మిస్తామని.. రూ.500 కోట్లలో వాటన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు.

కొత్త సచివాలయం అవసరమా?
కొత్త సచివాలయం అంశంపై బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై తొలుత మంత్రి తుమ్మల సమాధానమిచ్చారు. ప్రస్తుత సచివాలయ భవనాలు పాతవని, హరిత, అగ్నిమాపక ప్రమాణాలు లేకుండా ఉన్నాయని చెప్పారు. కొత్త సచివాలయ ప్రణాళికలన్నీ ఖరారైన తర్వాత అంచనా సమయాన్ని, వ్యయాన్ని నిర్ణయిస్తామన్నారు. దీంతో బీజేపీ సభ్యుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు కొత్త సచివాలయం ఎందుకు? ఉన్న సచివాలయంలోనే మార్పులు చేసి ఆధునీకరించవచ్చు కదా? అయినా బైసన్‌పోలో గ్రౌండ్‌ ఇచ్చేందుకు కేంద్రం పెట్టిన షరతులను ఎలా ఒప్పిస్తారు? ఇదేమీ ప్రాధాన్యతాంశం కాదు కదా?’’అని ప్రశ్నించారు. వాస్తు ప్రకారం చూస్తే ఇప్పుడున్న సచివాలయంలోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ మరో సభ్యుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యారని, కాంగ్రెస్‌ ఓడిపోయిందని.. అన్నింటికీ అనుకూలంగా ఉంది కాబట్టి కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని సూచించారు. దీంతో సీఎం కేసీఆర్‌ కల్పించుకుని బీజేపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

కంటోన్మెంట్‌కు ఓ చరిత్ర ఉంది
దేశంలోని 54 కంటోన్మెంట్లలో బొల్లారం కంటోన్మెంట్‌కు ఓ చరిత్ర ఉందని కేసీఆర్‌ చెప్పారు. ‘‘గతంలో లంగర్‌హౌజ్‌ కంటోన్మెంట్‌గా ఉండేది. అయితే బ్రిటిష్‌ వాళ్లు నిజాం రాజ్యంపై దండెత్తే పరిస్థితి ఉన్నప్పుడు అప్పటి నిజాం రాజు వారితో చర్చలు జరిపిండు. చర్చల్లో భాగంగా నిజాం రాజ్యంలో తమ కమిషనర్‌ ఉంటాడని, అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తాడని బ్రిటిష్‌ వాళ్లు చెప్పారు. అప్పుడు లంగర్‌హౌజ్‌లో ఉన్న కంటోన్మెంట్‌ను బొల్లారానికి మార్చారు. దేశంలో హైదరాబాద్‌ సంస్థానం విలీనం జరిగినప్పుడు కంటోన్మెంట్‌ భూహక్కుల బదలాయింపు జరగలేదు. ఇప్పుడది రక్షణ శాఖ పరిధిలో ఉందని గౌరవిస్తున్నం. నేను ఈ విషయాన్ని ప్రధానికి, కేంద్ర మంత్రులకు చెప్పిన. కేంద్రం ఎక్కువ తమాషా చేస్తే కోర్టుకెళతాం. సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటాం..’’అని స్పష్టం చేశారు.

ఇంత చెత్తగా ఎక్కడా లేదు
దేశంలోని 29 రాష్ట్రాల్లో ఇంతకన్నా చెత్త సచివాలయం ఇంకోటి లేదని, ఏ ఒక్క భవనం కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘సాక్షాత్తు సీఎం ఉండే సీబ్లాక్‌ ఘోరంగా ఉంది. సీఎం, సీఎస్‌ చాంబర్లు, కేబినెట్‌ రూం, వీడియో కాన్ఫరెన్స్‌ రూం అన్నీ ఒక్క భవనంలోనే ఉన్నాయి. ఎక్కడా ఫైరింజన్‌ నడిపే పరిస్థితి ఉండదు. గత ప్రభుత్వాలు మైండ్‌ ఓపెన్‌ చేసి పని చేయలేదు. మన సచివాలయానికి వచ్చిన ఇతర దేశాల వాళ్లు కొత్త సెక్రటేరియట్‌ కట్టుకోవచ్చు కదా అని మొహం మీదే అన్నారు. సచివాలయాలు రాష్ట్ర ప్రభుత్వ గౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకలు. కర్ణాటక, తమిళనాడుల్లో ఇదే తరహాలో సచివాలయాలు ఉంటాయి. అయినా కొత్త సచివాలయం కట్టంగనే ఏదో అయిపోతదని అంటున్నరు. సెక్రటేరియట్‌ కట్టంగనే హైదరాబాద్‌ ఆగమైపోతదా? హైదరాబాద్‌లో అసలు భవనాల నిర్మాణమే జరగడం లేదా? సచివాలయంతోపాటు అసెంబ్లీ, అన్ని ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాలు ఒక్కచోట కట్టాలన్నదే మా అభిప్రాయం’ అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో క్రీడాస్థలాలు లేనట్టు, ఉన్నవాటిని తాము చెడగొడుతున్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాల తీరును తప్పుబట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో దత్తాత్రేయ కుమార్తె పెళ్లి చేశారని వ్యాఖ్యానించారు. బైసన్‌పోలో గ్రౌండ్‌ క్రీడా మైదానమే కాదని గుర్తు చేశారు. కొత్త సచివాలయం కోసం చాలా స్థలాలు పరిశీలించి, బైసన్‌పోలో గ్రౌండ్‌ను ఖరారు చేశామని చెప్పారు.

అన్నీ ఒక్క చోటే నిర్మిస్తాం..
ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని ఎప్పుడో నిజాం కట్టించాడని, చెన్నారెడ్డి హయాంలో మార్పులు చేసి కొత్తది కట్టారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘మీరు, నేను వెళ్లే పోర్టికోలు చూశారా స్పీకర్‌ గారూ? నా బండి వచ్చే వరకు మీ బండి ఎండలో ఉండాలి. ఇది గొప్పగా కనపడుతోందా వాళ్లకు (విపక్షాలకు). దేశంలోని 6 మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. ఇది అంతర్జాతీయ నగరం. మనకు కనీసం కల్చరల్‌ సెంటర్‌ ఉందా? ఎప్పడిదో రవీంద్రభారతి. హైదరాబాద్‌లో చలన చిత్రోత్సవాలు ఎలా జరుగుతాయో చూశాం. ఒక మ్యూజిక్‌ కన్సర్ట్‌ ఉందా? ఇవన్నీ 6 లక్షల చదరపు గజాల్లో కట్టినా.. చదరపు గజానికి రూ.3వేల చొప్పున వేసుకుంటే రూ.180 కోట్లు. అదే రూ.4వేల చొప్పున వేసినా రూ.240 కోట్లు అవుతాయి. ఈ మాత్రం పెట్టలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నామా? వృథా ఖర్చు అంటున్నరు’ అని మండిపడ్డా రు. రక్షణ శాఖ నుంచి తీసుకునే 151 ఎకరాల్లోనే రాజీవ్‌ రహదారి విస్తరణ, ఎక్స్‌ప్రెస్‌వే, స్కైవేలు వస్తాయన్నారు. కొత్త సచివాలయం ఏర్పాటైన తర్వాత పాత భవనా లను ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటామన్నారు. సచివాలయం మార్పు తన ఆలోచన మాత్రమే కాదని, గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రయత్నం చేశారన్నారు. చారిత్రక కట్టడాన్ని ప్రజలకు అందించి తీరుతామని తేల్చి చెప్పారు. ఇది మంచిదా కాదా అన్నది ప్రజా కోర్టు నిర్ణయిస్తుందన్నారు.

సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారు
కొత్త సచివాలయ అంశంపై సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. బైసన్‌పోలో గ్రౌండ్‌ నుంచి క్రీడా కార్యకలాపాలను తప్పించాలంటే ప్రధాని కార్యాలయ అనుమతి కావాలని కేంద్రం చెప్పిందని స్పష్టం చేశారు. అసలు బైసన్‌ పోలో క్రీడా మైదానమే కాదంటున్నారని.. ప్రస్తుతమున్న మైదానాలను వినియోగించుకోకపోవడం ఎవరి నిర్వాకమని నిలదీశారు. ప్రజల మనోభావాలు గుర్తించి, గౌరవించి ముందుకెళ్లాలని సూచించారు. దీంతో లక్ష్మణ్‌పై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ‘‘అయినా మీరు చెప్పింది చేయడానికి మేమిక్కడ లేము. మాకు మా ఆలోచన ఉంది. మా ప్రతిపాదన విరమించుకునే ప్రసక్తే లేదు. అందరినీ సంతృప్తిపర్చి సచివాలయం కట్టి తీరుతం..’’అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు