నేడు కేసీఆర్‌ ప్రమాణం...

13 Dec, 2018 02:51 IST|Sakshi

మధ్యాహ్నం గం. 1.25కు రాజ్‌భవన్‌లో కార్యక్రమం

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ ఎన్నిక..

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం

వారం రోజుల్లో పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్‌ ఒక్కరే ప్రమాణం చేయనుండగా.. జిల్లాలు, సామాజిక వర్గాల కూర్పు అనంతరం వారంలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో సీఎంతోపాటు 17 మంది మంత్రులు ఉండాలి.. ఈ లెక్కల ప్రకారం.. సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం తెలంగాణభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకునే తీర్మానాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రవేశపెట్టారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ బలపరిచారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరు చప్పట్లతో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. 
 
గవర్నర్‌కు అందజేత 
టీఆర్‌ఎస్‌ శానససభాపక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక అనంతరం 11 మంది ఎమ్మెల్యేల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లింది. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిసి ఎన్నికకు సంబందించిన పత్రాలను అందజేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతను ఆహ్వానించాలని కోరింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి.లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్‌రెడ్డి, గొంగడి సునీత, అజ్మీరా రేఖానాయక్, దాస్యం వినయభాస్కర్, వి.శ్రీనివాస్‌గౌడ్, రవీంద్రకుమార్, కాలె యాదయ్యలు గవర్నర్‌ను కలిశారు. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌ నర్సింహన్‌కు అందజేసింది. అన్నింటినీ పరిశీలించిన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ నర్సింహన్‌ టీఆర్‌ఎల్పీనేత కేసీఆర్‌ను ఆహ్వానించారు. 
 
రాజీనామాలు ఆమోదం 
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ రాజీనామా చేస్తూ గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ పంపారు. గవర్నర్‌ దీన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి.. రాష్ట్ర మంత్రివర్గ రాజీనామా ఆమోదాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంత్రులంతా మాజీలయ్యారు. 
 
అసంతృప్తులు లేకుండా! 
మంత్రివర్గంలో ఎక్కువ మంది కొత్తవారికి చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గురువారం తనతోపాటు ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అదేరోజు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న వారిలో అవకాశం దక్కని వారు అసంతృప్తితో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అయితే ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న వారిలో ఎక్కువ మందిని పక్కనపెట్టే అవకాశం ఉంటుంది. మంత్రులుగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు, అజ్మీరా చందులాల్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. వీరి స్థానంలో కొత్తగా నలుగురికి అవకాశం కల్పించాల్సి ఉంది. జిల్లాలు, సామాజికవర్గాల కూర్పుతో కొత్త జట్టును ఎంపిక చేసుకోనున్నారు. 
 
పరిశీలనలో దానం, వివేకా 
సామాజికవర్గాల వారీగా ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్‌ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లకు చోటు కల్పించే అవకాశం ఉంది. వచ్చే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులు ఉంటారా లేదా అనేదానిపై స్పష్టతలేదు. అయితే.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి స్థానంలో మాదిగ సామాజికవర్గానికి చెందిన అరూరి రమేశ్, మహమూద్‌ అలీ స్థానంలో మహ్మమ్మద్‌ ఫరీదుద్దీన్‌లు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. టి పద్మారావుగౌడ్‌ స్థానంలో కేపీ వివేకానంద్‌ గౌడ్, జోగు రామన్న స్థానంలో దానం నాగేందర్‌ లేదా దాస్యం వినయభాస్కర్‌ పేర్లను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. స్పీకర్‌ పదవిని ఎవరికి అప్పగించాలనే విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే మంత్రివర్గ కూర్పు తుదిదశకు రానుంది.  

మరిన్ని వార్తలు