13 Dec, 2018 02:46 IST|Sakshi

ఫెడరల్‌ ఫ్రంట్‌తో అధికారంలోకి రాగానే అమలు

జాతీయ స్థాయిలో రైతులు, పేదల జీవితాలు మార్పు 

రాష్ట్రం ఆదాయం బాగుంది.. 2.3 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తాం 

18 నెలల్లో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు అందుబాటులోకి

అప్పటికల్లా పాలమూరు–రంగారెడ్డి 90 శాతం పూర్తి 

10 లక్షల మందికి నిరుద్యోగ భృతి 

గతంలో కుంభకోణాలు చేసిన వారి లెక్కలు బయటకు తీస్తాం 

కుక్కల్లాగా మొరిగితే చికిత్స చేస్తాం.. ఎవర్నీ వదలిపెట్టం 

ప్రత్యేక హోదాపై చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి 

త్వరలోనే మరో 2 జిల్లాలు.. మీడియాతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా సాహసోపేతంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొత్త ఫ్రంట్‌ అధికారంలోకి రాగానే.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసి.. రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేలా వ్యూహాలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం.. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని రైతులు, పేదలు, మైనారిటీలు అన్ని వర్గాల వారి స్థితిగతులను మార్చే లక్ష్యంతోనే జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తిని ప్రారంభించనున్నామని.. ఈ ప్రయత్నం కచ్చితంగా విజయవంతం అవుతుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రం ఆదాయం బాగానే ఉందని.. అందువల్ల వీలైనంత త్వరగా రూ.2.3 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పనులు కొనసాగుతున్న దుమ్ముగూడెం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతోపాటు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తిచేసి సాగునీటిని అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పతార (పరపతి) పెరిగిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని.. అయితే ఈ కార్యక్రమం అమలును మధ్యలోనే ఆపేయడం వల్ల అసలు లక్ష్యం నెరవేరలేదన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..     
 
గెలిస్తే.. దేశవ్యాప్తంగా రైతుబంధు 
‘రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. రాష్ట్రాల పరిస్థితి దిగజారుతోంది. చిన్న చిన్న అంశాల్లోనూ కేంద్రానికిదే అధికారం. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు కేంద్రం వద్ద ఉండాల్సిన అవసరం లేదు. ఐఐటీ వంటి పరిశోధన సంస్థలు కేంద్రం పరిధిలో ఉంటే పర్వాలేదు. కేంద్రం వద్ద పరిధికి మంచిన అధికారాలు ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ ఒకేతీరుగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాని మోదీ సహకార సమాఖ్య అంటున్నారు.

కానీ చేతల్లో మాత్రం వికేంద్రీకరణను మరింత కేంద్రీకృతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాల ఫ్యూడల్‌ పద్ధతి నశించాలి. అప్పుడే దేశంలో గుణాత్మక మార్పు వస్తుంది. నాకు ధైర్యం ఉంది. నేను అలాంటి మార్పును తీసుకొస్తా. ఫెడరల్‌ ఫ్రంట్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తాం. దీని కోసం ఏటా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. నా దగ్గర అజెండా ఉంది. లెక్కలున్నాయి. రైతుల పరిస్థితి మారుస్తాం’ 


 
చెవ్స్‌ పండించలేకపోయా! 
‘దేశంలో కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలి. పంటలను అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకునే పరిస్థితి లేదు. పురుగు మందులు అని, ఇంకోటని మెలికపెట్టి తిరస్కరిస్తారు. కట్‌ ఫ్లవర్‌ పంటలో ప్రపంచవ్యాప్తంగా 90% ఇజ్రాయిల్‌లోనే సాగు చేస్తున్నారు. చెవ్స్‌ పంట పండిద్దామనుకున్నా. అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకోలేమని తెలిసింది. దేశంలో అన్ని ఉన్నా రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు.

రాహుల్‌గాంధీ ఏదో రాష్ట్రానికి వెళ్లి క్వింటాల్‌ ధాన్యానికి రూ.2500 అన్నారు. కనీస మద్దతు ధర దేశమంతా ఒకేలా ఉండాలి. లేకుంటే తక్కువ ధర రాష్ట్రంలోనే వ్యాపారులు ఎక్కువ కొంటారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అంటారు. రాష్ట్రానికో విధానం చెబుతారు. ఓట్లు ఉంటే ఒక రకంగా లేకుంటే మరో రకంగా మాట్లాడుతారు. 
 
సీపీఎస్‌పై ద్వంద్వ విధానం 
జాతీయ పార్టీలు పచ్చి రాజకీయ అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగుల సీపీఎస్‌ విధానం తెచ్చింది యూపీఏ ప్రభుత్వం. ఇక్కడ అమలు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్లే తీసేయాలి అని డిమాండ్‌ చేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సీపీఎస్‌ను రద్దు చేయదు. ఇక్కడ బీజేపీ వాళ్లు రద్దు చేయాలని అంటారు. జాతీయ పార్టీల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు నడుంబిగించాలి.

జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తా. నేను ప్రాణానికి తెగించి ముందుకు సాగుతున్నా. కేంద్ర ప్రభుత్వాలవి చెత్త విధానాలు. యూపీఏ ప్రభుత్వం మోడల్‌ స్కూళ్లను తీసుకొచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. అలా మధ్యలో వదిలేస్తే ఎలా? అందుకే వీటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి వచ్చింది’ 
 
మేనిఫెస్టో 100% అమలుచేస్తాం 
‘నాలుగున్నరేళ్లలో మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌. రైతుబంధు, రైతుబీమా పథకాలను మేం మేనిఫెస్టోలో పెట్టలేదు. రైతు బీమాతో ఎలాంటి పైరవీలు లేకుండానే పేద రైతులకు సాయం వస్తోంది. ప్రజల అవసరాన్ని బట్టి ఇలాంటి 76 అంశాలను అమలు చేస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమంలో కోటి మంది పరీక్షలు చేయించుకున్నారు. అమ్మ ఒడికి మంచి పేరు వచ్చింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. కాన్పుకు అయ్యే రూ.30 వేల ఖర్చు తప్పుతోంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో బాల్య వివాహాలు లేకుండాపోయాయి.

ఆర్థిక వ్యవస్థ పెరిగింది. సంక్షేమ పథకాలను అమలు చేశాం. ఎరువులకు రైతులు ఇబ్బందిపడే రోజులు పోయాయి. గోదాములు లేక ఈ సమస్య అని గుర్తించాం. నాలుగు లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 25 లక్షల టన్నుల సామర్థ్యం పెంచాం. అన్ని రంగాలలో నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. మా పనితీరు, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు మాకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారు. ఉద్యమ పార్టీగా గత ఎన్నికలలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సరిగా చేసి చూపినం. ప్రజలు అన్ని చూసి తీర్పు ఇచ్చారు’ 
 
టీఎస్‌పీఎస్సీతో మైనస్‌ 
‘మాకన్నా ముందు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి? విపక్షాలు పచ్చి అబద్దాలు చెప్పి యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. అనవసరంగా నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు. ఇంటికో ఉద్యోగం అని ఎప్పుడూ చెప్పలేదు. నిరుద్యోగులను రెచ్చగొంటేందుకు కొందరు డ్రామాలు చేశారు. ఏటా లక్ష ఉద్యోగాల భర్తీ అంటే ఎలా? టీడీపీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న 60 ఏళ్లు ఇలాగే చేసుంటే.. 60 లక్షల ఉద్యోగాలు అయ్యేవి. ఇదో ఎన్నికల నినాదంగా మారింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన పార్టీలే అధికారం పోయాక ధర్నాలు చేస్తాయి.

మేం అలా కాదు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను 100% భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు విస్తృతమయ్యేలా కృషి చేస్తాం. టీఎస్‌పీఎస్సీ మాకు మైనస్‌ అయ్యింది. పనికిమాలిన పనులు ముందు పెట్టుకుని ఉద్యోగాల భర్తీలో జాప్యం చేసింది. అందుకే చివరికి కొన్ని పోస్టులను తీసి ఆయా శాఖలే భర్తీ చేసుకునేలా నిర్ణయాలు తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఒక శాతం కంటే తక్కువే ఉంటుంది. ప్రైవేటులోనూ ఎక్కువ ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం’ 
 
33 జిల్లాలు చేస్తాం 
‘టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్వీయ పన్నుల ఆదాయం వృద్ధిరేటు 29.90%గా ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ దీంట్లో సగం కూడా లేదు. అప్పులు ఎలా చెల్లించాలో మాకు తెలుసు. సాధారణంగా పెరిగేవి తప్ప ప్రత్యేకంగా పన్నులు పెంచం. వచ్చే నాలుగేళ్లలో రూ.10 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. రుణాల కింద రూ.2.30 లక్షల కోట్లు చెల్లిస్తాం. దీని వల్ల అదనంగా రూ.1.30 లక్షల కోట్ల రుణం పొందే అర్హత వస్తుంది. అన్నింటిపైనా అవగాహన ఉంది.

సాగునీటి ప్రాజెక్టులకు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఖమ్మం జిల్లాలో మాకు సీట్లు రాకపోయినా.. అక్కడ దుమ్ముగూడెం ప్రాజెక్టుతో వచ్చే జులైలో నీళ్ళు అందిస్తాం. 18 నెలల్లో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. అప్పటికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90%పూర్తవుతుంది. ప్రాజెక్టుల వద్దకు నేనే స్వయంగా వెళ్లి పరిశీలిస్తా. తెలంగాణ అన్ని రాంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వంతో రాష్ట్ర పతార (పరపతి)పెరిగింది. రూ.15 వేల కోట్లను అప్పుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్‌ఈసీ చైర్మన్‌ ఫోన్‌ చేశారు. తాజా తీర్పుతో ప్రజలు ఈ పతారను మరింత పెంచారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరుగుతుంది’ 
 
క్రమంగా అధికారాల బదిలీ 
‘స్థానిక సంస్థలను బలోపేతం చేసి క్రమంగా అధికారాలను వికేంద్రీకరిస్తాం. గత ప్రభుత్వాలు ఈ సంస్థల అధికారాలను ఒకొక్కటిగా వెనక్కి తీసుకున్నాయి. పంచాయతీ సమితి పరిధిలోనే అన్ని జరిగేవి. ప్రాథమిక పాఠశాలలో టీచర్లను, ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని నియమించే అధికారాలు బీడీవోలకు ఉండేవి. బీడీవోలను తొలగించారు. అన్ని ఆధికారాలను తీసుకున్నారు. ఇప్పుడు ఆర్థిక సంఘం నిధులు వస్తేనే జిల్లా పరిషత్‌లకు పనులు. వాటి పరిస్థితి దయనీయంగా ఉంది. నిర్మాణాత్మక మార్పులు రావాలి’ 
 
10 లక్షల మందికి నిరుద్యోగ భృతి 
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగభృతిని చెల్లిస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉంది. ఈలోపు వరుసగా పంచాయతీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. మధ్యలో అమలు చేయడం వీలు కాదు. నిరుద్యోగుల భృతి అర్హతలపై నియమావళి రూపకల్పన కోసం కమిటీని నియమిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం పథకాన్ని అమలు చేస్తాం. మా అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి నిరుద్యోగభృతి చెల్లింపు జరుగుతుంది’ 
 
వదిలిపెట్టే ప్రసక్తే లేదు 
‘అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేశారో అందరికీ తెలుసు. కుంభకోణాలు చేసినోళ్లను, దొంగలను ఎప్పుడైనా బయటకి తీసుకురావచ్చు అని ఊరుకున్నా. వాటిని బయటికి తీస్తే.. సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇదేం పద్ధతి అంటరని ఊరుకున్నా. ఈ నాలుగున్నరేళ్లలో ఎవరినీ ముట్టుకోలేదు. ఈసారి మాత్రం వదలిపెట్టే ప్రసక్తే లేదు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. కుక్కలు మొరిగినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. కచ్చితంగా చికిత్స చేస్తాం. ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది’ 
 
కోఠి చౌరాస్తాలో అమ్ముతరు 
‘ప్రభుత్వాధినేత గట్టిగా ఉండాలి. మన ప్రజాస్వామిక వ్యవస్థ అలాగే ఉంది. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రత్యేకమే. నేను కొంచెం ఎక్కువ కట్టిక ఉంటా. అట్ల లేకపోతే.. సర్కారు కాదు సర్కస్‌ అయితది. గట్టిగా ఉండకపోతే నన్ను కోఠి చౌరస్తాలో రూపాయి పావలకు అమ్ముతరు. నేను గట్టిగ ఉండడం వల్లనే.. మా పాలనలో అవినీతికి తావులేదు. నేనెవర్నీ కలవడం లేదనేది సరికాదు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్, ప్రణయ్‌రాయ్‌ వంటి మీడియా ఎడిటర్లు ఫోన్లు చేసి కలుస్తామని అడుగుతారు.

వారిని పిలిచి ఊరికే ముచ్చట చెప్పి పంపేంత సమయం నాకు లేదని చెప్పా. ప్రజల కోసం ఏం చేయాలనే దానికే ప్రాధాన్యత ఇస్తా. కంటివెలుగు వంటి పథకాలు అమలు చేస్తుంటే ప్రతికూల మీడియాకు అవేవి కనిపించవు. సమాచార శాఖ నా దగ్గరే ఉంటది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తప్పకుండా ఇస్తాం. రిటైర్డ్‌ జర్నలిస్టులకు పింఛను విధానంపై అధ్యయనం చేయిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం’ 


106 సీట్లు వస్తాయనుకున్నా! 
అసెంబ్లీ ఎన్నికలలో తాను ఆశించిన ఫలితాలు రాలేదని కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలతో భోజనం చేస్తూ ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికలలో 96 నుంచి 106 సీట్లు వస్తాయని అనుకున్నా. ఆశించిన ఫలితాలు రాలేదు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారు టీఆర్‌ఎస్‌లోకి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. ఓడిపోయిన మంత్రులను కేబినెట్‌లోకి తీసుకుంటే విమర్శలొస్తాయి. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది.’అని ఆయన వెల్లడించారు.

‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీని కుటుంబంతో వెళ్లి కలిశా. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనంపై చర్చించాం. దిగ్విజయ్‌సింగ్‌తో ఆ విషయం మాట్లాడాలని సోనియా అన్నారు. ఆ తర్వాత దిగ్విజయ్‌సింగ్‌ను కలిశా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకత్వం మీకిస్తే ఎలా అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. వెంటనే హైదరాబాద్‌కు వచ్చి పార్టీ నేతలతో చర్చించాం. ఏదైనా సరే ఒంటరిగా పోటీ చేద్దామని అందరు అన్నారు. అదే నిర్ణయించుకున్నాం. మొండిగా ఎన్నికల్లో పోరాడాం. ప్రజలకు మాకు అధికారం ఇచ్చారు. వారు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తున్న తీరుపై సంతృప్తితో మళ్లీ గెలిపించారు’కేసీఆర్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు