ఎదురుచూపులు..!!

10 Nov, 2018 09:45 IST|Sakshi

     కోదాడ అసెంబ్లీ అభ్యర్థుల  ప్రకటనలను నాన్చుతున్న పార్టీలు

     టికెట్లు ఎవరికి వస్తుందోనని ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉత్కంఠ 

సాక్షి,కోదాడ : అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఏ ముహూర్తాన ప్రకటించారోగాని కోదాడ వాసులకు మాత్రం గడిచిన రెండు నెలలుగా అభ్యర్థుల ప్రకటనలపై ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రం మొత్తం స్పష్టత వచ్చినప్పటికీ కోదాడ స్థానంపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఇటు అధికార పార్టీలో అటు ప్రతిపక్ష పార్టీలో అదే పరిస్థితి నెలకొనడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఢీలా పడ్డారు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు టీవీల్లో చూడడం, తెల్లవారిన తరువాత పత్రికల్లో వెదకడం రెండు నెలలుగా కోదాడ నాయకుల దినచర్యగా మారింది. కాని పరిస్థితిలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదు. తాజాగా శనివారం అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం సాగుతుంది. కాని ఆరోజు కూడా రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెడుతున్నారనే సమాచారం అందుతండడంతో స్థానికంగా ఉత్కంఠ పెరిగిపోతుంది.
నువ్వా.. నేనా..?
కోదాడ టికెట్‌ కోసం అధికార టీఆర్‌ఎస్‌ నుంచి ఇన్‌చార్జ్‌ కె.శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎవ్వరికి టికెట్‌ ఇవ్వాలో తేల్చకుండా రెండు నెలలుగా వ్యవహారాన్ని నాన్చుతూ వచ్చింది. దీంతో విసుగు చెందిన కొందరు నేతలు పార్టీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. ఐనప్పటికీ పార్టీ మాత్రం నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. చందర్‌రావు హైదరాబాద్‌లో తన సామాజిక వర్గానికి చెందిన కొంత మందితో తీవ్ర లాబీయింగ్‌ చేయిస్తుండగా శశిధర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌ల మీద భారం వేసి కోదాడకు, హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్నాడు. మధ్య, మధ్యలో మండలాల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోతున్నారు.
మీకా.. మాకా...?
ఇదీలా ఉండగా కాంగ్రెస్‌ కూడా కోదాడ టికెట్‌ విషయంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మావతికి టికెట్‌ గ్యారంటీ లేకపోవడం కాంగ్రెస్‌ నాయకులకు, కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తుంది. మహాకూటమిలో భాగంగా కోదాడ టికెట్‌ను టీడీపీ కోరుతుందనే ప్రచారం వారి ఆందోళనకు కారణమవుతుంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొల్లం మల్లయ్యయాదవ్‌ తనకు టికెట్‌ ఖాయమని, ఏపీ సీఎం తనకు హామీ ఇచ్చారని చెపుతుండడంతో క్యాడర్‌లో ఆయోమయం నెలకొంది. 
సందట్లో సడేమియా..!! 
టికెట్ల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా సామాజిక మాధ్యమాల్లో, వాట్సప్‌ గ్రూపులలో జరుగుతున్న ప్రచారం ఇరు పార్టీల నేతలకు కాక పుట్టిస్తుంది. ఫలాన గ్రూపులో ఇలా వచ్చింది, ఫలానా వారికి ఈ మెసేజ్‌ వచ్చింది... వాస్తవమేనా ? అంటూ పలువురు ఇతరులకు ఫోన్లుచేసి వాకబు చేస్తున్నారు. ఈ ఉత్కంఠకు శనివారం కూడా తెరపడడం లేదని తెలుస్తుండడంతో ఇంకా కోదాడ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. 

మరిన్ని వార్తలు