రేపు శ్రీశైలానికి కృష్ణా జలాలు

31 Jul, 2019 02:40 IST|Sakshi
మంగళవారం నిండుకుండలా జూరాల ప్రాజెక్టు

జూరాలకు లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో

సాక్షి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్‌/గద్వాల టౌన్‌: ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా కృష్ణా నదీ జలాలు దిగువకు వస్తుండటంతో జూరాల నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి ఏకంగా ఎగువ నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతుండటంతో సాయంత్రం ఏడు గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 9.66 టీఎంసీలకుగాను 5.5 టీఎంసీలకు చేరింది. ఎగువ ఆల్మట్టిలోకి 2 లక్షల క్యూసె క్కుల వరద వస్తుండటంతో అంతే నీటిని దిగువ నా రాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్‌ సైతం ఇప్పటికే నిండటంతో 20 గేట్లు ఎత్తి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ జూరాలకు వదులుతున్నారు. ఈ నీరంతా జూరాలకు చేరి నిల్వ పెరగడంతో జూరాల నుంచి నీటి విడుదల మొదలైంది.

నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1 ద్వారా 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌ ద్వారా 315 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తుండగా కుడి, ఎడమ కాల్వలకు 900 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. దీంతోపాటు జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో ఆ నీరంతా శ్రీశైలం దిశగా పరుగులు తీస్తోంది.  జూరాల నుంచి విడుదలైన జలాలు గురువారం ఉదయానికి శ్రీశైలం చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 31 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇక్కడ నీటి నిల్వ 854 అడుగులకు చేరిన వెంటనే తెలంగాణ, ఏపీ నీటి వినియోగం మొదలు పెట్టనున్నాయి. ఇప్పటికే కల్వకుర్తి ద్వారా నీటి ఎత్తిపోతలకు పంపులు సిద్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇంజనీర్లను ఆదేశించారు. గతేడాదితో పోలిస్తే జూరాల జలవిద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి 10 రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. 

మరిన్ని వార్తలు