Sakshi News home page

‘కృష్ణా’ పంపకాల బాధ్యత.. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కే 

Published Thu, Oct 5 2023 3:15 AM

Center is a key decision regarding distribution of Krishna river water - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్‌రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కార చట్టం–1956లోని సెక్షన్‌ 5 (1) కింద ఇప్పటికే కొనసాగుతున్న బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కే.. వివాదాల పరిష్కార బాధ్యతలను కూడా కట్టబెడుతున్నట్టు కేంద్ర కేబినెట్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ అనుసరించాల్సిన విధివిధానాలను (టెరŠమ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌/టీఓఆర్‌) ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.

ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే చేసిన విజ్ఞప్తిని కేంద్రం పరిశీలించింది. దీనిపై న్యాయశాఖ సలహా మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, వినియోగం, నియంత్రణపై ట్రిబ్యునల్‌ తీసుకునే నిర్ణయాలు.. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడతాయని, ఇరు రాష్ట్రాల ప్రజలు లబ్ధి పొందుతారని తెలిపింది. ఈ నిర్ణయం పటిష్ట భారతదేశ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది. 

కృష్ణా జల వివాదాలు, పరిణామాలు ఇలా.. 

1969 ఏప్రిల్‌ 10న మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ ప్రభుత్వాల ప్రతిపాదన మేరకు జస్టిస్‌ బచావత్‌ నేతృత్వంలో కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్స్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–1 ఏర్పాటైంది. 
1976 మే 27న: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయిస్తూ బచావత్‌ ట్రిబ్యునల్‌ తుది నివేదిక (ఫైనల్‌ అవార్డు) ఇచ్చింది. 
1976 మే 31: బచావత్‌ అవార్డును అమలు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 25 ఏళ్ల వరకూ అవార్డును పునః సమీక్షించాలంటూ కోరవద్దని షరతు పెట్టింది. 
2004 ఏప్రిల్‌ 2: బచావత్‌ అవార్డు కాల పరిధి ముగియడంతో కృష్ణా జలాలను సెక్షన్‌–3 కింద పునఃపంపిణీ చేయాలని మూడు రాష్ట్రాలు కోరడంతో జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ అధ్యక్షతన కేడబ్ల్యూడీటీ–2ను ఏర్పాటు చేసిన కేంద్రం 
2010 డిసెంబర్‌ 30: మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. 
2013 నవంబర్‌ 29: మూడు రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ సెక్షన్‌–5(3) కింద బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. (ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంతో దాన్ని కేంద్రం అమల్లోకి తేలేదు) 
2014 మార్చి 1: ఉమ్మడి ఏపీని విభజిస్తూ చట్టాన్ని ఆమోదించిన కేంద్రం. ఆ చట్టంలో సెక్షన్‌–89 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటినే తెలంగాణ, ఏపీల మధ్య పంపిణీ చేసే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని నిర్ణయం. 
2014 మే 15: బ్రిజేశ్‌ ట్రిబ్యుల్‌ తుది నివేదికలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను.. తెలంగాణ, ఏపీలకు పంపిణీ చేసే బాధ్యతను అదే ట్రిబ్యునల్‌కు అప్పగించిన కేంద్రం. 
2016 అక్టోబర్‌ 19: మొత్తం కృష్ణా పరీవాహక ప్రాంతం పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ ట్రిబ్యునల్‌ను కోరాయి. దీనిపై వాదనలు విన్న ట్రిబ్యునల్‌ ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీకే పరిమితం అవుతామంటూ ఉత్తర్వులిచ్చింది. 
2020 అక్టోబర్‌ 6: అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో సెక్షన్‌–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరారు. దీనితో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని ఉపసంహరించుకుని ప్రతిపాదన పంపాలని.. న్యాయ సలహా తీసుకుని, తుది నిర్ణయానికి వస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు. 
2021, అక్టోబర్‌ 6: కృష్ణా జలాలను సెక్షన్‌–3 కింద పునఃపంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది. 
2023, అక్టోబర్‌ 4: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను రూపొందిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.  

Advertisement

What’s your opinion

Advertisement