లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి

19 Nov, 2017 01:35 IST|Sakshi

ఇంద్రవెల్లిలో ఆదివాసీల భారీ ర్యాలీ

ఇంద్రవెల్లి(ఖానాపూర్‌): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీలు డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు ఉద్యమం ఆపేది లేదని తేల్చి చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి స్తూపం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ఆదివాసీలు శనివారం భారీ ర్యాలీ తీశారు. నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నా.. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. ఐటీడీఏ ఏపీవో జనరల్‌ కుమ్రు నాగోరావు, తహసీల్దార్‌ శివరాజ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ గత పాలకులు లంబాడీలను విద్యాపరంగా మాత్రమే 1976లో ఎస్టీ జాబితాలో చేర్చారని, దీంతో అసలైన ఆదివాసీలకు వచ్చే ఉద్యోగ, రాజకీయ హక్కులన్నీ లంబాడీలే దోచుకుంటున్నారని ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో డిసెంబర్‌ 9న ‘చలో హైదరాబాద్‌’ నిర్వహిస్తామని చెప్పారు. ఏజెన్సీలో 144 సెక్షన్‌ ఎత్తివేయా లని డిమాండ్‌ చేశారు.

ఆదివాసీల ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎన్డీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి వెడ్మా బోజ్జు, అమరవీరుల ఆశయ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావ్, ఆదివాసీ నాయకులు కనక తుకారాం, ఆర్క ఖమ్ము, తోడసం నాగోరావ్, ఆయా గ్రామాల పెద్దలు వెట్టి రాజేశ్వర్, సోయం మాన్కు, హెరేకుమ్ర జంగు, మెస్రం ఇస్తారి, కినక లచ్చు, మెస్రం వెంకట్‌రావ్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు