కదం తొక్కిన న్యాయవాదులు

13 Feb, 2019 03:55 IST|Sakshi
గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు సునీల్‌ గౌడ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి తదితరులు

పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు 

హైకోర్టులో విధుల బహిష్కరణ 

గవర్నర్‌కు వినతిపత్రం సమర్పణ 

సాక్షి, హైదరాబాద్‌: తమ సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.5 వేల కోట్ల కేటాయింపు, జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల ఉపకార వేతనం చెల్లింపు, మెడిక్లెయిమ్, రూ.20 లక్షల బీమా తదితర డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల కోర్టు విధులను బహిష్కరించారు. హైకోర్టులో కూడా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కోర్టు హాళ్లలోకి వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయమూర్తులను కోరారు. వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు కూడా లేకపోవడంతో న్యాయమూర్తులు బెంచ్‌ దిగి తమ చాంబర్లకు వెళ్లిపోయారు. ఉదయం 11.30 కల్లా హైకోర్టు దాదాపుగా ఖాళీ అయింది.

అనంతరం న్యాయవాదులు బార్‌ కౌన్సిల్‌ గేటు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు అక్కడ తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఆ తరువాత పలువురు న్యాయవాదులు హైదరాబాద్‌ కలెక్టరేట్‌కు వెళ్లి అక్కడ కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రం అందించారు. ఆ వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపాలని కలెక్టర్‌ను కోరారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పీపుల్స్‌ ప్లాజాకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌తో పాటు హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఇతర కోర్టుల న్యాయవాదుల సంఘాల ప్రతివాదులు మంగళవారం నాటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు