సుపరిపాలన కోసమే  చట్ట సవరణలు

11 Jun, 2019 02:13 IST|Sakshi
తెలంగాణ సీఎం కేసీఆర్‌

చట్టాల పటిష్ట అమలుతోనే గుణాత్మక అభివృద్ధి

పంచాయతీరాజ్‌ తరహాలో పటిష్టంగా కొత్త మున్సిపల్‌ చట్టం

పంచాయతీరాజ్‌ చట్టం అమలుకు కొత్త కార్యాచరణ

సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాలు, పట్టణాల గుణాత్మక అభివృద్ధిలో పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాల పటిష్ట అమలు కీలకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఉన్న చట్టాలను సవరించి పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరముందని, తద్వారా ప్రజలకు గ్రామాలు, మున్సిపాలిటీ స్థాయిల్లో సుపరిపాలన అందించగలుగుతామన్నారు. రాష్ట్రంలో పంచాయితీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పంచాయితీరాజ్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ తయారీతోపాటు కొత్త మున్సిపల్‌ చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

‘‘పంచాయితీరాజ్‌ చట్టాన్ని పటిష్టంగా రూపొందించిన పద్ధతిలోనే అవినీతిరహితంగా పాలన అందే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా మున్సిపల్‌ చట్టం రూపకల్పన చేయాలె. నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలె. మనం మనుసు పెట్టి పనిచేస్తే గ్రామాలు, మున్సిపాలిటీ స్థాయిల్లో కావాల్సినంత పని ఉన్నది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రహించాలె. విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన నుంచి గ్రామాల్లో పచ్చదనం పరిశ్రుభ్రతతోపాటు ఇతర మౌలిక రంగాల అభివృద్ధి చేపట్టాల్సిన బాధ్యత మనమీదున్నది’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మున్సిపాలిటీలు దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందించాల్సి అవసరం ఉందన్నారు. ఈ దిశగా చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా బాధ్యులను చేస్తూ పకడ్బందీగా మున్సిపల్‌ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. మున్సిపల్‌ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందించగలిగితే ప్రజలకు అంత గొప్పగా సేవలందిచగలుగుతామని అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మల్యే ఆరూరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు