కొల్చారం.. రండి చూసొద్దాం   

28 Apr, 2018 11:09 IST|Sakshi
తిరుమలయ్య గుట్ట

ఆకట్టుకుంటున్న పార్శ్వనాథుడి జైనమందిరం

గత చరిత్రను తెలియజేసే తిరుమలయ్యగుట్ట

మతసామరస్యానికి ప్రతీకగా షేక్‌షాబొద్దీన్‌ దర్గా

కొల్చారం(నర్సాపూర్‌) :  కొల్చారం మండల పరిసర ప్రాంతాలు పురాతన కట్టడాలకు, ప్రకృతి రమణీయతకు పేరుగాంచాయి. ఇక్కడ భూమిలో ఎక్కడ తవ్వినా.. కట్టడాలు, విగ్రహాలే దర్శనమిస్తాయి.ప్రస్తుతం కొల్చారంలో దర్శనీయ స్థలాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  కొల్చారం పూర్వపు నామం కోలాచలం. కోలాచలం కాస్త కొలిచెలిమగా మారి రానురాను అది కొల్చారంగా రూపుదిద్దుకుంది.  ఇక్కడి చరిత్రను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కొల్చారంను దర్శించాల్సిందే.

కాకతీయుల ఆనవాళ్లు..

మండల కేంద్రానికి పురాతనమైన చరిత్ర ఉంది. ఎన్నో రాజవంశాలు ఈ నేలను పరిపాలించాయి. కొ ల్చారం గ్రామం చుట్టూ భవన నిర్మాణాల కోసం ఎక్క డ తవ్వినా ఏదో ఒక దేవత విగ్రహం, కట్టడాలకు సం బంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. కాకతీయు ల కాలం మొదలుకుని నిజాం కాలం వరకు ఇక్కడి విగ్రహాలు, శాసనాలు నాటి చరిత్రను తెలియజేస్తున్నాయి.

ప్రకృతి రమణీయతకు నిలయం..

చూడదగ్గ మరో ప్రదేశం తిరుమలయ్యగుట్ట. కొల్చారం నుంచి వరిగుంతానికి వెళ్లే ఎడమవైపు ఈ గుట్ట దర్శనమిస్తుంది. పచ్చని ప్రకృతి రమణీయతను చాటుతూ గుట్టపైకి వెళ్తే తిరుమలేశుని దర్శించుకోవచ్చు. ఈ గుట్టకూ ఓ ప్రత్యేకత ఉంది. క్లిష్టమైన వ్యాఖ్యాన ప్రక్రియకు ప్రాణం పోసి కాళిదాసు రచించిన పంచకావ్యాలకు వ్యాఖ్యానం చేసిన సాహితీ వేత్త కోలిచాల మల్లినాథసూరి జ్ఞానసముపార్జన పొందిన స్థలం ఈ గుట్ట. ఇంతటి చరిత్రను తనలో ఉంచుకున్న కొల్చారంను దర్శించడం తప్పనిసరి. మరి ఆలస్యం ఎందుకు నేడే దర్శించుకునేందుకు బయలుదేరండి మరీ. 

మతసామరస్యానికి ప్రతీక..

ఇక్కడ పురాతనమైన దర్గా మత సామరస్యానికి  ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ ముస్లింల పరిపాలన కొనసాగిందనడానికి  షేక్‌షాబొద్దిన్‌ దర్గా నిదర్శనం. ఇక్కడ వారంలో ఆరు రోజులు పెద్ద ఎత్తున భక్తులు మతాలకు అతీతంగా వచ్చి దర్శించుకుంటారు.

తొమ్మిదిన్నర అడుగుల ఏకశిలా విగ్రహం..

1984లో వీరభద్రస్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా శెల్యరాతితో చెక్కిన ఏకశిలతో దిగంబరంగా తలపై ఏడు సర్పాలు పడగకప్పి ఉన్న విగ్రహం బయటపడింది. తొమ్మిదిన్నర అడుగులున్న ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా గుర్తించారు. ఆనాటి రాజైన త్రిభువన ఈ శిలావిగ్రహాన్ని చెక్కించినట్లుగా, ఇది జైన గురువైన 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహంగా చరిత్రకారులు గుర్తించారు.

ప్రస్తుతం ఈ విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన జైన ఆలయంలో ప్రతిష్ఠించారు. దేశంలో శ్రావణబెలగొళలోని గోమటేశ్వరుని విగ్రహం తర్వాతి స్థానాన్ని ఈ ఏకశిలా విగ్రహం దక్కించుకుంది. పూర్తి ప్రకృతి రమణీయత ప్రతిబింబించేలా ప్రశాంత వాతావరణంలో దేవాలయం నిర్మించడంతో చాలామంది పర్యాటకులు  ఈ దేవాలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.  

మరిన్ని వార్తలు