అద్భుత క్షేత్రంగా శివాలయం

27 May, 2019 02:41 IST|Sakshi

యాదాద్రిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మాణం

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న శివాలయం అద్భుతంగా రూపు దిద్దుకుంటోంది. యాదగిరికొండపై ఎకరం స్థలంలో శివాలయాన్ని నభూతోనభవిష్యత్‌ అన్న రీతిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయం చుట్టూ ప్రాకారం పూర్తి చేశారు. ప్రాకార గోడలపై అందమైన పువ్వుల డిజైన్లతోపాటు శిల్పాలను అమర్చారు. నవ నందులు, శివుడికి ప్రతి రూపాలు, అమ్మవారి అష్టలక్ష్మి శిల్పాలను ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునే విధంగా పంచతల రాజగోపురాన్ని నిర్మించారు. ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ముఖ మండపాన్ని నిర్మిస్తున్నా రు. అదే విధంగా మరకత లింగాన్ని ప్రతిష్ట చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో పూర్తయ్యేలా పనులను వేగవంతం చేశారు. 

గతంలో ఉన్న ఆలయం కంటే భిన్నంగా..
సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో యాదగిరికొండపై 14 ఎకరాల్లో ప్రధాన ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా శివాలయాన్ని గతంలో కంటే భిన్నంగా నిర్మిస్తున్నారు. కాకతీయులు, చోళుల కాలంనాటి నిర్మాణ రీతులను ప్రామాణికంగా తీసు కుని అందుకు అనుగుణంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా భక్తులకు అన్ని వసతుల ను ఏర్పాటు చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న çవిశాలమైన స్థలంలో స్వామివారి పూజకు కావాల్సిన బిల్వం, మారేడు వృక్షాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు రూ.300 కోట్ల ప్రణాళికతో ఆలయ పనులు కొనసాగుతున్నాయి.  

మరిన్ని వార్తలు