ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి

28 Sep, 2023 08:42 IST|Sakshi
దక్షిణ రాజగోపురంపై కలశాన్ని బిగిస్తున్న సిబ్బంది

సాక్షి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన సమయంలో దక్షిణ రాజగోపురంపై ప్రతిష్టించిన బంగారు కలశాల్లో ఒకటి ఊడిపోయి కింద పడిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై స్థానిక భక్తులు, పలువురు అధికారులు తెలిపిన వివరాలివి. యాదాద్రి ఆలయ దక్షిణ రాజగోపురంపై బిగించిన బంగారు కలశాల్లో ఒకటి మంగళవారం సాయంత్రం సమయంలో కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన ఆలయాధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.

దక్షిణ రాజగోపురంపై బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం శిల్పులు తిరిగి బిగించారు. దీనిపై ఆలయ డీఈవో దోర్భల భాస్కర్‌శర్మను ప్రస్తావించగా.. గోపురంపై కలశాలు బిగించేటప్పుడు కింద పడకుండా చెక్కలను ఏర్పాటు చేశారని తెలిపారు. అవి వదులైపోవడంతో పాటు కోతులు వాటిపైకి ఎక్కి ఆడటంతో ఊడిపోయాయని పేర్కొన్నారు. వెంటనే గోపురం వద్ద పూజలు జరిపించి, శిల్పులతో బిగించామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు