ఇద్దరు చంద్రులూ మోసగాళ్లే

26 Feb, 2015 04:35 IST|Sakshi
ఇద్దరు చంద్రులూ మోసగాళ్లే

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
సిరికొండ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ మాదిగలను మోసం చేసిన వారేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాదిగల ఉద్యమాలతో ఆ వర్గానికి తప్ప సమాజంలోని మిగిలిన వారందరికీ మేలు జరిగిందని అన్నారు.

దండోరా పోరాటాలతోనే ఆరోగ్యశ్రీ పథకం, వికలాంగులకు రూ.1500 పింఛన్లు అమలయ్యాయని చెప్పారు. ఇద్దరు సీఎంలు మాదిగల అండతోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామన్న తెలంగాణ సీఏం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకున్నారని, ఏపీ సీఎం చంద్రబాబు అయితే మొత్తానికే ముఖం చాటేశారని విమర్శించారు. తెలంగాణ నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఏపీలో వర్గీకరణ తీర్మానం చేయాలనే డిమాండ్‌తో వచ్చే నెల 18న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించనున్నట్లు ప్రకటించారు.

తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పడమే కాకుండా మంత్రి వర్గంలో ఉన్న రాజయ్యను అకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్, మండలాధ్యక్షుడు అశోక్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పిప్పెర సంజీవ్, నాయకులు గణేష్, సాయిలు, ఎంఎస్‌పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఫర్జానా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు