గట్టిగా అడుగుదాం!

9 Aug, 2018 03:27 IST|Sakshi

విభజన హామీలపై రేపు ఢిల్లీలో సమావేశం 

కీలకంగా పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ భేటీ 

వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర విభజన పెండింగ్‌ అంశాలపై కేంద్ర హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరగనుంది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది.

ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న దాదాపు 20 అంశాలపై సమర్థంగా వాదన వినిపించేలా రాష్ట్ర ప్రభుత్వ సిద్ధమైంది. సీఎస్‌ ఎస్‌.కె.జోషి నేతృత్వంలోని ఉన్నతాధికారులు అవసరమైన నివేదికలను రూపొందించారు. ఈ నివేదిక కాపీలను ఇప్పటికే పార్లమెంట్‌ అధికారులకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, విభజన అంశా ల పరిష్కార బాధ్యతలు చూస్తున్న ఆర్థిక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు భేటీకి హాజరుకానున్నారు. పెండింగ్‌లో ఉన్నవి, ఇప్పటి వరకు ఆచరణ మొదలుకాని అంశాలపై సమగ్ర నివేదికలను సిద్ధం చేసి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపొందించారు. 

ప్రధానంగా ఇవీ.
ఉమ్మడి హైకోర్టు విభజన, తెలంగాణ నుంచి ఏపీకి బదలాయించిన ఏడు మండలాలను తిరిగి అప్పగించడం, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు, 2 రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఏపీ భవన్‌ విభజన, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులుృఅప్పుల పంపకాలు, హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం భవనాల అప్పగింత, రోడ్డు పర్మిట్, నదీ జలాల అంశాలపై అధికారులు వాదనలు వినిపించనున్నారు. విభజన తర్వాత కేంద్రం ఏపీకి విడుదల చేసిన రూ.1,621 కోట్ల నిధుల్లో తెలంగాణ వాటా చెల్లింపును వివరించనున్నారు.

మరిన్ని వార్తలు