రా‘బంధువులవుదాం’

9 Aug, 2018 03:24 IST|Sakshi

వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా బెజ్జూరు, గూడెం, గిరెల్లి అటవీ ప్రాంతాలు 

ప్రకటించాలంటూ కేంద్రానికిప్రతిపాదనలు పంపిన రాష్ట్ర అటవీ శాఖ 

పాలరాపుగుట్టపై రాబందుల ఆవాస పరిరక్షణకు నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: అంతరించిపోతున్న అరుదైన జాతి రాబందులను సంరక్షించేందుకు బెజ్జూరు రిజర్వ్‌ అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర అటవీ శాఖ ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపింది. జెజ్జూరుతో పాటు గూడెం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి ‘జటాయు’ పేరుతో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలోని బెజ్జూరు రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో గల పాలరాపుగుట్ట మీద రాబందుల ఉనికిని 2013లో గుర్తించారు.

200 మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న పాలరాపుగుట్టపై 100 మీటర్ల ఎత్తులో రాబందులు ఆవాసం ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. రాబందుల పునరుత్పత్తి, ఆవాసాలకు రక్షణ కల్పించేందుకు అదే సంవత్సరం నుంచి రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. 2013లో 10 రాబందులు మాత్రమే ఇక్కడ ఉండగా, 2016–17 నాటికి 30కి పెరిగాయి. ఏటా సగటున 6 నుంచి 8 రాబందుల పిల్లలు పుడుతున్నాయి. వీటి పరిరక్షణకు బెజ్జూరు రిజర్వ్‌ అటవీ ప్రాంతం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి 397.99 చ.కి.మీ. మేర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడం అవసరమని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాష్ట్ర అటవీ శాఖ నివేదించింది.  
పులుల రక్షణకు కూడా.. 
మహారాష్ట్రలోని తాడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇం ద్రావతి పులుల సంరక్షణ కేంద్రాల నుంచి రాష్ట్రం లోని కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రానికి పులుల రాకపోకలకు బెజ్జూరు రిజర్వు అటవీ ప్రాంతం కారిడార్‌గా ఉపయోగపడుతోంది. 2016 తర్వాత కెమె రాలకు 7 పులులు చిక్కాయి. ఈ ప్రాంతంలో చిరు తలు, ఎలుగుబంట్లు, చౌసింగా, సాంబార్, నీల్‌గాయ్‌ జింకలు, దుప్పులూ నివాసముంటున్నాయి. వాస్తవానికి 2016 డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర వన్య ప్రాణుల బోర్డు సమావేశంలో కాగజ్‌నగర్‌ డివిజన్‌ను రాబందుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన తదుపరి బోర్డు సమావేశంలో బెజ్జూరును వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పా టుచేస్తే అంతరించిపోతున్న పులులు, రాబందులు, ఇతర వన్యప్రాణులకు రక్షణ లభిస్తుందని తీర్మానించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటిస్తే అందులోకి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం అమల్లోకి రానుంది. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు సైతం లభించనున్నాయి. 

ఆహారం కోసం గడ్చిరోలికి.. 
రాష్ట్రంలో పాలరాపుగుట్టపైనే రాబందులున్నా యి. దక్షిణ భారత్‌లో రాబందుల అతిపెద్ద నివాస ప్రాంతం ఇదే. భారత్, పాకిస్తాన్, నేపాల్‌లో ఈ జాతి రాబందులు అరుదుగా కనిపిస్తున్నాయి. పాలరాపుగుట్టపై ఉండే రాబందులకు పశువుల కళేబరాలను ఆహారంగా వేసినా తినకుండా గడ్చిరోలికి వెళ్తున్నాయని అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.  

 


 

మరిన్ని వార్తలు