పనులు పూర్తిచేయకపోవడం బాధాకరం

17 Jul, 2015 01:23 IST|Sakshi

 నల్లగొండ
 పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధులను సద్వినియోగపరచి ప్రజల సామూహిక అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోను, జిల్లా కలెక్టర్ చాంబర్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణతో కలిసి వేర్వేరుగా వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో మంజూరు పనులు, వాటి ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు విధిగా పాటిస్తూ మంజూరైన పనులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఏజన్సీలను ఆయన కోరారు.
 
  2013-14 సంవత్సరానికి సంబంధించిన పనులు కూడా కొన్ని ప్రారంభించకపోవడం, మరికొన్ని ఇంకా పూర్తి చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రారంభించని పనులు 10 రోజుల్లో ప్రారంభించాలని లేకుంటే రద్దు చేయడానికి ప్రతిపాదించాలని కోరారు. పూర్తిచేసిన ప్రతి పని దగ్గర పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి పూర్తి చేసినట్లు తెలిపే శిలాఫలకాలు విధిగా ఏర్పాటు చేయాలని ఇంజనీర్లను కోరారు. ఈ విషయములో ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికీ అధికారులు పాటిం చకపోవడం విచాకరమన్నారు.  రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పనులు పూర్తి అయి ఆరు నెలలు గడిచినా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు  పనుల ఎంబీ పూర్తి చేయనందున బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందన్నారు.
 
 రాజ్యసభ సభ్యుడి నిధుల నుంచి చౌటుప్పల్ ఆస్పత్రికి ఇచ్చిన అంబులెన్సును రోగుల కోసం వినియోగించకుండా డాక్టర్లు సొంత పనులకు వాడుకుంటున్నారనిఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దృష్టికి తెచ్చినా ఫలితం కనిపించలేదని ఆయన ఇన్‌చార్జి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ వెంటనే స్పందిస్తూ ఈ విషయంలో అంబులెన్స్ లాగ్ బుక్ సమర్పించాలని, విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని టెలిఫోన్‌లో ఆదేశించారు. నారాయణపురం మండలంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి 24గంటల లోగా ఎంబీ రికార్డు చేసి చెల్లింపులు జరపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రవి, సీపీఓ నాగేశ్వర్‌రావు, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు