భర్త స్థానంలో తండ్రి పేరు

21 Nov, 2018 11:59 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మహాకూటమి తరఫున కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి వెంకట సుహాసిని ఓటరు కార్డులో ఆమె భర్త స్థానంలో తండ్రి హరికృష్ణ పేరు నమోదైంది. ఆమె ఇటీవలే నాంపల్లి నియోజకవర్గం నుంచి ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే తలంపుతోనే ‘నందమూరి’ పేరు ప్రచారం కోసం కాబోలు... ఆమె చుండ్రు ఇంటి కోడలైనప్పటికీ, నందమూరి వెంకట సుహాసినిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఆమె భర్త చుండ్రు వెంకట శ్రీకాంత్‌. సాధారణంగా పెళ్లయ్యాక ఓటరుగా నమోదు చేయించుకునేటప్పుడు తండ్రి/భర్త స్థానం కాలమ్‌లో భర్త పేరు నమోదు చేయించుకుంటారు. అయితే సుహాసిని మాత్రం తండ్రి పేరు నమోదు చేయించుకున్నారు.

కానీ పొరపాటో మరి తొందరపాటో తెలియదు గానీ.. తండ్రి పేరు కాస్తా భర్తగా నమోదైంది. ఆమె అఫిడవిట్‌లో హరికృష్ణను తండ్రిగానే పేర్కొన్నారు. అయితే అఫిడవిట్‌తో పాటు ఓటరుగా నమోదైనట్లు తెలియజేసేందుకు సమర్పించిన ఓటరు జాబితా సర్టిఫైడ్‌ కాపీలోనూ తండ్రి పేరు అని ఉన్న చోట భర్త పేరుగా హరికృష్ణ పేరుతోనే జారీ చేశారు. ‘ఫాదర్‌’ అని ఉండగా, కొట్టివేసి వైఫ్‌ ఆఫ్‌ అని దిద్ది ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ జారీ చేశారు. ఓటరు జాబితాలో ఉన్న మేరకే అలా చేశారని తెలుస్తోంది. నాంపల్లి నియోజకవర్గంలోని ఎన్నికల జాబితా పార్ట్‌నెంబర్‌ 48, సీరియల్‌ నెంబర్‌ 710 ఓటరుగా ఆమె పేరు నమోదైంది. ఇదే విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి మమత దృష్టికి తీసుకెళ్లగా... ఇలాంటి స్వల్ప పొరపాట్లు జరుగుతుంటాయని, అలాంటి వాటితో నామినేషన్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు