హవ్వ..... ఆటోలో వస్తారా...

11 Apr, 2015 10:10 IST|Sakshi
హవ్వ..... ఆటోలో వస్తారా...

సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం

అసలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి...
ఖరీదయిన ఖద్దరు బట్టలు...
ఇద్దరు గన్ మెన్లు
పక్కన మందీ మార్బలం
ప్రయాణించేందుకు కాస్ట్ లీ కారు..


ఇవి ఓ శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు. అయితే ఆయన ప్రయాణించేందుకు ఎట్ లీస్ట్  మారుతీ కారు కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించాల్సిందే. అదే ఆయన చేసిన తప్పిదం. దాంతో  తానేంటో నిరూపించుకునేందుకు గుర్తింపు కార్డు చూపించుకుని  దుస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆయన సామాన్య వ్యక్తా అంటే కానేకాదు. సాక్షాత్తు సీనియర్  ఎమ్మెల్యే. పోనీ తొలిసారి ఎన్నికైన శాసనసభ్యుడా అంటే అదీ కాదు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినాసరే ఆ పెద్ద మనిషి...'నేను ఎమ్మెల్యేను మహాప్రభో నమ్మండి...అంటూ మొత్తుకున్నా వినలేదు. దాంతో తన గుర్తింపు కార్డును చూపించి సచివాలయంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజును చూసిన కళ్లతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి వేసిందంట ఓ ఇల్లాలికి. మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ కార్లులో  రయ్ రయ్ మంటూ వచ్చే ఎమ్మెల్యేలను చూడటం అలవాటు అయిన పోలీసులకు ఆటోలో వచ్చిన ఆయన కళ్లకు ఆనలేదు. అంతేకాకుండా నువ్వు ఎమ్మెల్యేవా ...అయితే కారేదీ...గన్ మెన్లు ఏరీ అంటూ విసిగించారు.  సచివాలయం సాక్షిగా ఖమ్మం జిల్లా భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు గురువారం ఈ చేదు అనుభవం ఎదురైంది.

తన నియోజకవర్గంలో ఓ పని నిమిత్తం సచివాలయానికి ఆటోలో వచ్చిన రాజయ్యను సచివాలయ భద్రతా సిబ్బంది లోపలకి పంపకుండా బయటే ఆపేశారు. ఆయనతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన ఎమ్మెల్యే అంటూ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. దాంతో ఆటో దిగి సున్నం రాజయ్య లోనికి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.  బడాయిలకు పోకుండా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా సింపుల్ జీవితాన్ని గడిపే ఎమ్మెల్యేలను మన రాష్ట్రంలో వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.

ఎమ్మెల్యే సున్నం రాజయ్య...ఆయన ఎవరూ అని ఇప్పటికీ చాలామంది తెల్లమొహం వేస్తారు.  ఎంతమంది ఆయనను గుర్తుపడతారు అనేది కూడా క్విజ్ పోటీల్లో వేసే ప్రశ్న లాంటిదే. అసెంబ్లీలో పేపర్ల చింపేసి...మైకులు విరగొట్టి... బూతులు తిట్టివారికి సినిమా హీరోల కంటే ఎక్కువ పాపులారిటీ లభిస్తుంది కానీ....ప్రజా సమస్యల కోసం నిస్వార్థంగా పోరాడేవారికి ఆ గుర్తింపు ఉండదేమో. ధర్నాలు, నిరసనలు అంటూ నిత్యం మీడియాలో హైలెట్ అయ్యే  పాలి(ట్రి)టిక్స్ ను మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన  ఆయన వంటపట్టించుకోపోవటం వల్లే సెక్యూరిటీ సున్నం రాజయ్యను గుర్తు పట్టలేదేమో.

పక్క రాష్ట్రంలో సీఎం ఆటోలో వెళ్లాడు... రైలులో ప్రయాణించాడంటూ గొప్పలు చెప్పుకుంటాం. అదే మన రాష్ట్రంలో ఎమ్మెల్యే మాత్రం ఆటో ప్రయాణిస్తే మాత్రం జీర్ణించుకోలేం. . అలాంటి ఎమ్మెల్యే ఆటోలో మన స్టేటస్ కు నామోషీ కదా. ప్రజల మధ్యలో నుంచి వచ్చి..వారితో మమేకమే..ప్రజా సమస్యల కోసం పోరాడే వారికి మనమిచ్చే గౌరవం ఇదా. నయా పైసా స్వలాభం కోసం ఆశ పడకుండా ప్రజల కోసం పాటుపడుతూ 'రాజకీయాలను' వంట పట్టించుకోలేని రాజయ్యది తప్పా!

పార్వతి.వై

మరిన్ని వార్తలు