2017 నాటికి పూర్తి చేయండి

12 May, 2015 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రెండోదశను జూన్-డిసెంబర్ 2017 నాటికి పూర్తి చేయాలని అధికారులను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదేశించారు. తెలంగాణలోని పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై మంత్రి సోమవారం పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ద.మ.రైల్వే జీఎం శ్రీవాత్సవ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల, జలమండలి ఎండీ జగదీశ్వర్‌లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్‌బ్రిడ్జిలు, పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ ప్రాజెక్టులపై ద.మ. రైల్వే జీఎంతో సమీక్షించారు.

ఎంఎంటీఎస్ రెండోదశ పనులు చర్లపల్లి-ఘట్‌కేసర్, బొల్లారం-మేడ్చల్ మార్గాల్లో ఊపందుకున్నాయని జీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. సనత్‌నగర్-అమ్ముగూడా మార్గంలో పనులు చేపట్టేందుకు నాలుగు ఎకరాల రక్షణ శాఖ స్థలం సేకరణలో జాప్యం అవుతోందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫలక్‌నుమా-ఉందానగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు జీఎంఆర్ సంస్థ అంగీకరించడం లేదని తెలపగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వే విస్తరణ పనులు మార్చి 2016 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ పథకం పూర్తికి రూ.50 కోట్ల మేర నిధుల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే గోదావరి మంచినీటి పథకంలో భాగంగా చేపట్టిన పైప్‌లైన్ పనులకు మెట్టుగూడా రైల్వే క్రాసింగ్ వద్ద అనుమతులు మంజూరు చేయించాలని జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ మంత్రిని కోరారు. అమృత్ పథకం కింద మూసీ ప్రక్షాళన రెండోదశను చేపట్టేందుకు పట్టణాభివృద్ధి శాఖపై ఒత్తిడి తేవాలని జలమండలి ఎండీ జగదీశ్వర్ కోరగా.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు