బాలికపై మాంత్రికుడి కీచక చేష్టలు

29 Aug, 2018 08:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వ్యాధి నయం చేస్తానంటూ మాయమాటలు

మంత్రాల పేరుతో గదిలోకి తీసుకెళ్లి అసభ్యప్రవర్తన

పోలీసులకు ఫిర్యాదు నిందితుడిని రిమాండ్‌కు తరలించిన నార్సింగి పోలీసులు

 రాజేంద్రనగర్‌ : మంత్రం వేసి అనారోగ్యాన్ని మాయం చేస్తానని నమ్మించి ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాంత్రికుడిని నార్సింగి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని 16 సంవత్సరాలు పదో తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం కాళ్లు, చేతులు తరుచు తిమ్మిర్లు పడుతుండడంతో అస్వస్తతకు గురైంది. స్థానికంగా డాక్టర్లకు చూపించినా నయం కాలేదు. దీంతో బాలిక తల్లి నగరంలోని ఆస్పత్రిలో చూపించేందుకు ఆటోలో కూతురుతో కలిసి బయల్దేరింది. ఆటో డ్రైవర్‌ మాటలు కలిపి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. తన కూతురు అనారోగ్య పరిస్థితి గురించి వివరించింది.

ఆటో డ్రైవర్‌ హైదర్షాకోట్‌ ప్రాంతంలోని అబీబ్‌ అలీఖాన్‌(48) మంత్రాలు వేసి రోగాలు నయం చేస్తాడని చెప్పాడు. తిమ్మిర్లు మంత్రంతో నయం అవుతాయని నమ్మించాడు. దీంతో బాలిక తల్లి మంత్రగాడి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పడంతో ఆటో డ్రైవర్‌ హైదర్షాకోట్‌లో దించి వెళ్లిపోయాడు. బాలికను పరీక్షించి వరుసగా మూడు రోజులు మంత్రం వేయాలని అబీబ్‌ అలీఖాన్‌ తెలిపాడు. మూడ్రోజుల పాటు మంత్రం వేసిన తగ్గకపోవడంతో తల్లి మంత్రగాడిని ప్రశ్నించింది. దీంతో మంత్రం పూర్తిగా శరీరానికి వేయాలని బయట కూర్చోమని తల్లికి సూచించాడు.

బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లి దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయబ్రాంతులకు గురైన విద్యార్థిని ఇంటికి వెళ్లే సమయంలో మాంత్రికుడి కీచక చేష్టలను తల్లికి వివరించింది. మరోసారి అక్కడకు వద్దు బయట తెలిస్తే పరువుపోతుందని తల్లి కూతుళ్లు మిన్నకుండిపోయారు. రెండు రోజుల పాటు రాకపోవడంతో మంత్రగాడు సోమవారం ఉదయం తల్లికి ఫోన్‌ చేసి రావాలని సూచించాడు. రానని తెలపడంతో బెదిరించాడు. దీంతో తల్లి సోమవారం రాత్రి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

మరిన్ని వార్తలు