హైటెన్షన్‌.. ఒంటి స్తంభంపై

17 Nov, 2017 01:24 IST|Sakshi

నగర ప్రాంతాల్లో స్థల సేకరణకు పరిష్కారంగా!  

 రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు కానున్న మోనోపోల్‌ లైన్లు

హైదరాబాద్‌ మహా నగరంలో ఏటేటా విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిపోతోంది. గతేడాది వేసవిలో గరిష్ట డిమాండ్‌ 2,800 మెగావాట్లకు చేరింది. ఏటా 250–300 మెగావాట్ల మేర డిమాండ్‌ పెరుగుతోంది. మరోవైపు నగరానికి 4,500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. దీంతో భవిష్యత్తు అవసరాల కోసం హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్లు ఏర్పాటు చేయాలి. కానీ వీటికి స్థలం ఎక్కువగా అవసరం. భూగర్భ విద్యుత్‌ కేబుల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవకాశమున్నా.. వ్యయం చాలా ఎక్కువ. భూగర్భంలో 400 కేవీ విద్యుత్‌ లైన్‌ వేసేందుకు ఒక్కో కిలోమీటర్‌కు రూ.45 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఒంటి స్తంభాల (మోనో పోల్స్‌)పై ఈహెచ్‌టీ (ఎక్స్‌ట్రా హైటెన్షన్‌) లైన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్‌ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో) నిర్ణయించింది. అయితే నాలుగు స్తంభాల టవర్లతో పోల్చితే మోనో పోల్స్‌తో వేసే లైన్ల నిర్మాణానికి 2.5 రెట్ల వరకు అధిక వ్యయం అవుతుంది. కానీ భూసేకరణ ఖర్చు బాగా తగ్గిపోయే నేపథ్యంలో మొత్తం ఖర్చు తగ్గుతుంది.     
– సాక్షి, హైదరాబాద్‌

ఐటీ కారిడార్‌లో స్థలం లభించక.. 
కేతిరెడ్డిపల్లి–రాయదుర్గ్‌ 400 కేవీ లైన్‌ ఏర్పాటు కోసం నార్సింగ్‌ చౌరస్తా వరకు సాంప్రదాయ పద్ధతిలో లాటిస్‌ టవర్ల ఏర్పాటుకు స్థలాల లభ్యత ఉంది. అక్కడి నుంచి రాయదుర్గ్‌ వరకు స్థలం సేకరించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఐటీ కారిడార్‌ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో భూముల ధరలు చాలా ఎక్కువ. దీంతో నార్సింగ్‌ చౌరస్తా నుంచి రాయదుర్గ్‌ వరకు 15 కిలోమీటర్ల మేర భూగర్భంలో 400 కేవీ లైన్‌ వేయాలని ట్రాన్స్‌కో తొలుత భావించింది. కానీ భూగర్భ లైన్‌కు కిలోమీటర్‌కు రూ.45 కోట్ల మేర ఖర్చవుతుందని తేలడంతో పునరాలోచనలో పడింది. దీనికి తోడు భూగర్భంలో విద్యుత్‌ లైన్లు వేసేందుకు ఏకంగా 8 మీటర్ల వెడల్పున రహదారులను తవ్వి.. అనంతరం వాటిని పునర్నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మోనో పోల్స్‌తో లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. నాలుగు స్తంభాల టవర్లకు 10 నుంచి 13 చదరపు మీటర్ల స్థలం అవసరంకాగా.. మోనోపోల్‌కు కేవలం 1.5 నుంచి 3 చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. వ్యయం కూడా కిలోమీటర్‌ నిడివికి కేవలం రూ.3.5 కోట్ల వరకు మాత్రమే అవుతుందని తేల్చారు. కేతిరెడ్డిపల్లి–రాయదుర్గ్‌ వరకు 400 కేవీ లైన్‌ ఏర్పాటుకు మొత్తం రూ.1,600 కోట్ల వ్యయం కానుండగా.. అందులో నార్సింగ్‌ చౌరస్తా నుంచి రాయదుర్గ్‌ వరకు మోనోపోల్స్‌తో లైన్‌కు రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. భూగర్భలైన్లకు బదులుగా మోనోపోల్స్‌తో 400 కేవీ లైన్‌ నిర్మిస్తే.. రూ.500 కోట్లు ఆదా అవుతున్నాయని ట్రాన్స్‌కో డైరెక్టర్‌ (ట్రాన్స్‌మిషన్‌) టి.జగత్‌రెడ్డి తెలిపారు. 

ఒకే భారీ స్తంభం ఆధారంగా.. 
రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్మించిన 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ, 765 కేవీ ఈహెచ్‌టీ విద్యుత్‌ లైన్లన్నింటినీ.. లాటిస్‌ (చతురస్త్రాకారంలో ఉండే నాలుగు స్తంభాల అల్లిక) టవర్లపై ఏర్పాటు చేశారు. కానీ తొలిసారిగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మోనో పోల్స్‌తో రెండు ఈహెచ్‌టీ లైన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కేతిరెడ్డిపల్లి నుంచి రాయదుర్గ్‌ వరకు 45 కిలోమీటర్ల పొడవున 400 కేవీ సామర్థ్యంతో.. నర్సాపూర్‌ నుంచి భౌరంపేట్‌ వరకు 220 కేవీ సామర్థ్యంతో లైన్ల ఏర్పాటుకు ట్రాన్స్‌కో చర్యలు తీసుకుంటోంది. ఈ రెండు లైన్లలో స్థల సేకరణ సమస్యలున్న చోట మోనో పోల్స్‌తో నిర్మించాలని నిర్ణయించింది.

భౌరంపేట లైన్‌లోనూ..
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నుంచి మేడ్చల్‌ జిల్లా భౌరంపేట వరకు 220 కేవీ లైన్‌ను ట్రాన్స్‌కో నిర్మించనుంది. అయితే ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో ఆరు కిలోమీటర్ల మేర భూసేకరణ సమస్యగా మారింది. తొలుత భూగర్భంలో లైన్లు వేయాలని భావించగా.. ఈ 6 కిలోమీటర్లకు రూ.85 కోట్ల మేర వ్యయమవుతుందని తేలింది. దీంతో పునరాలోచన చేసిన ట్రాన్స్‌కో.. కిలోమీటర్‌ వరకు భూగర్భంలో లైన్‌ వేసి, మిగతా 5 కిలోమీటర్ల మేర మోనోపోల్స్‌తో ఏర్పాటుకు అవకాశమున్నట్లు గుర్తించింది. మొత్తంగా రూ.38 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. 

గ్రామీణ ప్రాంతాల్లో వేస్తే..? 
గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాల మీదుగా నాలుగు స్తంభాల టవర్లతో కూడిన లైన్లు వేస్తుండడంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్కో టవర్‌ నిర్మాణానికి 10–15 చదరపు మీటర్ల స్థలం పోతుండగా.. రైతులకు తగిన పరిహారం అందడం లేదన్న ఆరోపణలున్నాయి. దాంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ మోనో పోల్స్‌తో లైన్లు వేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ నాలుగు స్తంభాల టవర్లతో పోల్చితే మోనోపోల్స్‌తో లైన్ల నిర్మాణానికి 2.5 రెట్ల వరకు అధిక వ్యయం కావడం, గ్రామీణ ప్రాంతాల్లో స్థలానికి పెద్దగా ఖర్చు ఉండకపోవడం నేపథ్యంలో.. ఈ అంశాన్ని పరిశీలించడం లేదని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు