ప్రాణహితకు జాతీయ హోదా కష్టమే

20 Feb, 2015 03:13 IST|Sakshi
ప్రాణహితకు జాతీయ హోదా కష్టమే

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
 అధ్యక్షుడు జస్టిస్ రెడ్డపరెడ్డి, కార్యదర్శి పద్మనాభరెడ్డి వ్యాఖ్య

 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కడం కష్టమేనని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ రెడ్డపరెడ్డి, కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. అంతర్రాష్ట్ర వివాదాలు, పర్యావరణ, అటవీ, నీతి ఆయోగ్ అనుమతులు, ప్రాజెక్టుకయ్యే వ్యయం తేలకుండా జాతీయ హోదా ఎలా దక్కుతుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 2004 నుంచి ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారని, వాస్తవాలు ప్రజలకు తెలిసేలా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జస్టిస్ రెడ్డపరెడ్డి, పద్మనాభరెడ్డి గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదంటూనే ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని పలు ప్రశ్నలు సంధించారు.
 
*  ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల వ్యయమవుతుంది. ఆలస్యమైతే వ్యయం మరింత పెరగవచ్చు. ప్రాజెక్టు పూర్తయితే 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ప్రస్తుత అంచనా ఖర్చు మేరకు ఎకరానికి రూ.4 లక్షల ఖర్చు అవుతోంది. ఇక 1,200 అడుగుల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోయాలంటే 2,527 మెగావాట్ల విద్యుత్ అవసరం. దీనికి ఏడాదిలో ఒక్కో ఎకరానికి లెక్కిస్తే రూ.15 వేల మేర ఖర్చువుతుంది. ఈ స్థాయిలో విద్యుత్, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇంత ఆర్థిక భారం ఎలా మోస్తారు?
*  ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే అటవీ భూమికి ఇంతవరకూ పరిహార భూమిని ఇవ్వలేదని అటవీ శాఖ చెబుతోంది. పర్యావరణ అనుమతులు సైతం లభించలేదు. ఎత్తుపై మహారాష్ట్ర అంగీకరించాలి. ఇలా 18 అంశాలపై ఏమీ తేలకుండా జాతీయ హోదా దక్కడం సాధ్యం కాదు. అంతర్రాష్ట్ర వివాద పరిష్కారం కోసం గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చర్చలు జరిగి మండలి ఏర్పాటుకు ఒప్పందం కుదిరినా, అది ఒక్కమారు సైతం సమావేశం కాలేదు. అలాంటప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే ఉన్నత స్థాయి కమిటీ ఎంతవరకు పనిచేస్తుంది?
*  వ్యాప్‌కోస్ సర్వే నివేదిక ప్రకారం ప్రాణహిత నదిపై ఆనకట్ట అవసరం లేదు. మరి 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట కట్టాలని, దానికి మహారాష్ట్ర అభ్యంతరం తెలిపిందని, ఎత్తు తగ్గించుకునేందుకు తెలంగాణ ఒప్పుకుందన్న కథనాలపై వివరణ ఇవ్వాలి.
*  ఒకవేళ ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యమేనా?
*  మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్‌లకు నాలుగేళ్లలో 48 వేల కోట్లు అంటే సాలీనా 12 వేల కోట్లు అవసరం. అలాంటప్పుడు ప్రాజెక్టుకు ఏడాదికి రూ.5 వేల కోట్లు కేటాయించినా 2025 నాటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందా?
*  పర్యావరణానికి సంబంధించి మొదటి దశ అనుమతులు కూడా ఇవ్వలేదని అటవీ శాఖ చెబుతోంది.. ఇది నిజమేనా?

మరిన్ని వార్తలు