పెద్ద పులుల పంజా!

8 Jul, 2020 13:23 IST|Sakshi
పెద్దపులి దాడిలో మృతి చెందిన కోడెను పరిశీలిస్తున్న అటవీ అధికారులు, బాధిత కాపరి

పశువులపై వరుస దాడులు  

3రోజుల్లోనే కోడె, ఆవుదూడ బలి

బిక్కుబిక్కుమంటున్న కాపరులు

ఆందోళనలో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు

బల్మూర్‌ (అచ్చంపేట): నల్లమల టైగర్‌ రిజర్వు ఫారెస్టులో పెద్ద పులులు గాండ్రిస్తూ పంజా విసురుతున్నాయి. ఏకంగా పశువులపై దాడులు చేసి చంపుతుండటంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలంలోని సరిహద్దు గ్రామాలైన అంబగిరి, బాణాల అటవీ ప్రాంతాల్లో మూడు రోజుల వ్యవధిలోనే ఆవుదూడ, కోడెను చంపాయి. రెండు నెలలల క్రితం అంబగిరిలోని రైతు బిచ్చాకు చెందిన ఎద్దు అడవిలోకి మేతకు వెళ్లి ఇప్పటికీ ఆచూకీ లేకపోవడంతో పులి దాడి చేసి చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే 15రోజుల క్రితం బల్మూర్‌కు చెందిన కాపరి రాములుకు చెందిన మేకపోతుపై అంబగిరి పమీపంలో పులి దాడి చేయగా గమనించిన అతను కేకలు వేయడంతో వదిలిపెట్టి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో మేకపోతుకు గాయాలయ్యాయి. 

బిక్కుబిక్కుమంటున్న కాపరులు
ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి అంబగిరి సమీపంలోనే పశువుల పాకలో ఉన్న ఆవుదూడపై పులి దాడి చేసి చంపగా.. మరో దూడ ఆచూకీ లేకుండాపోయింది. తాజాగా సోమవారం రాత్రి బాణాలకు చెందిన రైతు భాస్కర్‌కు చెందిన కోడెను సమీప అటవీ ప్రాంతంలో మరో పులి దాడి చేసి చంపింది. ఇక గతంలో కంటే అధికంగా రైతులు తమ భూములను సాగు చేస్తుండటంతో బహిరంగ ప్రదేశాల్లో మేత లేక పశువులకు అడవే దిక్కుగా మారింది. దీంతో సరిహద్దు గ్రామాల నుంచి కాపరులు నిత్యం పశువులను అడవికి తీసుకెళ్లక తప్పడం లేదు. ఈ క్రమంలో పెద్దపులుల దాడులతో బిక్కుబిక్కుమంటున్నారు. 

అధికారులు హెచ్చరిస్తున్నా..  
అడవిలో పులుల సంఖ్య పెరిగిందని, ఎవరూ లోపలికి వెళ్లొద్దని అధికారులు సమీప గ్రామాల్లో బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ హెచ్చరికలను కాపరులతో పాటు వంట చెరుకు కోసం వెళ్లే వారు పట్టించుకోవడం లేదు. వీరికి గత్యంతరం లేక అడవిలోకి వెళ్లక తప్పడం లేదు. ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో పులుల నుంచి పశువులతో పాటు కాపరుల ప్రాణాలకే ముప్పుగా మారింది.

మరిన్ని వార్తలు