రుద్రమదేవికి  ‘నంది’ రావాల్సింది

17 Nov, 2017 04:05 IST|Sakshi

ప్రముఖ సినీ దర్శక నటుడు ఆర్‌.నారాయణమూర్తి

సాక్షి, హైదరాబాద్‌: సంస్కృతి, విలువలు, మానవీయతకు అద్దంపట్టిన చిత్రాలకు గతంలో నంది అవార్డులు ఇచ్చేవారని ప్రముఖ సినీ దర్శక నటుడు ఆర్‌.నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పుడు అవార్డులు అంటే, ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారాయని అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ సినిమాను వరంగల్‌ జిల్లా ఏనుమాముల మార్కెట్‌లో చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి హరీశ్‌ రావును కోరేందుకు గురువారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆ సినిమాలో నారాయణమూర్తి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈసారి అవార్డుల్లో రుద్రమదేవి సినిమాకు నంది అవార్డు రావాల్సింది. రుద్రమదేవి లాంటి మహనీయురాలి జీవితాన్ని సెల్యులాయిడ్‌కు ఎక్కించడం అంత తేలిక కాదు. అలాంటి సినిమాను గుర్తించాల్సింది. బాహుబలి సినిమా సాంకేతికంగా, వాణిజ్యపరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అందుకు ఆ సినీమా దర్శకుడు రాజమౌళికి సెల్యూట్‌. కానీ, బాహుబలికి జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయింది. ఆ సినిమా చరిత్ర కాదు, సందేశాత్మకం కాదు. అది పూర్తిగా కమర్షియల్‌ సినిమా. ఇప్పుడు కమర్షియల్‌ సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది’అని నారాయణమూర్తి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు