నంది అవార్డులకు 38 మంది ఎంపిక.. వారిద్దరి పేర్లతో అవార్డ్స్‌: పోసాని

13 Oct, 2023 16:00 IST|Sakshi

ఏపీలో నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి  రంగం సిద్ధమైంది. ఈ అవార్డుల బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించారని, ఉత్తములు, అర్హులకు మాత్రమే ఆ అవార్డులను అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు.  ఒకేసారి డ్రామా, టీవీ, సినిమా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదని, మొదటగా పద్యనాటకాలకు అందించి, ఆ తర్వాత మిగతా రంగాలకు అందిస్తామని ఆయన గతంలోనే వెల్లడించారు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

అందులో భాగంగా తాజాగా నంది అవార్డుల పోటీలలో 38 మంది ఎంపికయ్యారని పోసాని కృష్ణమురళి తెలిపారు. వీరికి ఫైనల్ పోటీలను గుంటూరులో నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అవార్డుల ఎంపికలో ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా 12 మంది జడ్జిలను నియమించామని ఆయన చెప్పారు. వారందరూ కలిసి 38 మందిని అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఈ ఏడాది నుంచి ఎన్టీఆర్ రంగస్థల అవార్డును ఇస్తున్నట్లు పోసాని చెప్పారు. ఆ అవార్డుతో పాటు రూ. 1.5 లక్షలు బహుమానం ఇస్తామన్నారు.

వైఎస్సార్ రంగస్థల పురష్కారం కూడా అందిస్తున్నట్లు పోసాని ప్రకటించారు. ఈ అవార్డుతో పాటు  రంగస్థల రంగానికి కృషి చేసినందుకు రూ. 5లక్షలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక 2004 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రంగ స్థలాన్ని ప్రోత్సహించారని ఆయన గుర్తుచేశారు. అందుకే ముఖ్యమైన జిల్లాల్లో ఆడిటోరియంలు కట్టించినట్లు చెప్పుకొచ్చారు. నాటక సమాజానికి సాయం చేసినందుకు వైఎస్ఆర్ పేరుతో పురష్కారం ఇస్తున్నట్లు పోసాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నటులు, సాంకేతిక నిపుణులకు త్వరలోనే గుర్తింపు కార్డులు ఇస్తాం.

సినిమా ఇండస్ట్రీలో చాలా పేద ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినీ నటులందరికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వారితో పాటు సాంకేతిక నిపుణులకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తాం. ఆన్‌లైన్‌లో నటుల వివరాలు అన్ని పొందుపరుస్తాం. ఉచితంగానే నటులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. షూటింగ్‌లకు వెళ్లే సినీ నటుల కోసం బస్సు రాయితీ ప్రతిపాదనపై చర్చిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా షూటింగ్‌ ఉచితంగా చేసుకోవచ్చు. స్టూడియోలు కడితే వారికి స్థలాలు ఇచ్చి సహకరిస్తామని సీఎం జగన్‌ చెప్పారు. సినిమా రంగం అభివృద్ది కోసం సీఎం జగన్‌ ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు.’అని పోసాని అన్నారు.  

మరిన్ని వార్తలు