అద్దె భవనాలు కావాలి ‘గురు’!

18 Mar, 2019 02:42 IST|Sakshi

జూన్‌ నుంచి ప్రారంభం కానున్న మరో 119 గురుకుల పాఠశాలలు

అద్దె భవనాల్లో ఏర్పాటుకు బీసీ గురుకులాల సొసైటీ సన్నాహాలు 

ఏప్రిల్‌ నెలాఖరులోగా భవనాలు గుర్తించాలన్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ అద్దె భవనాల వెతు కులాటలో పడింది. 2019–20 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వీటికి శాశ్వత భవనాలు లేనందున అద్దె భవనాల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాటిని వెతికేందుకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది. ఏప్రిల్‌ నెలాఖరులోగా అద్దె భవనాలను గుర్తించి లొకేషన్లు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు బీసీ గురుకుల సొసైటీ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురుకుల పాఠశాలలను నెలకొల్పే విస్తీర్ణంలో భవనాలు లభించకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. 

20 వేల చదరపు అడుగుల భవనం... 
ఒక గురుకుల పాఠశాల ఏర్పాటుకు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనం ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. ఐదు నుంచి పదో తరగతి వరకు రెండేసి సెక్షన్లు... ఒక్కో సెక్షన్‌లో నలభై మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, వసతిగృహాలు, డైనింగ్‌ హాలు, కిచెన్, మూత్రశాల, స్టాఫ్‌ రూమ్, ప్రిన్సిపాల్‌ రూమ్, స్టోర్‌ రూమ్‌ తదితరాలకు కచ్చితంగా 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంగల భవనం కావాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, క్షేత్రస్థాయిలో అంత విస్తీర్ణమున్న భవనాల లభ్యత కష్టంగా మారింది. రెండేళ్ల క్రితం మంజూరు చేసిన గురుకుల పాఠశాలల ఏర్పాటును అతి కష్టంగా పూర్తి చేసిన అధికారులకు ప్రస్తుత లక్ష్యం సాధించడం ‘కత్తి మీద సాము’లా మారింది. 

పాత వాటిలో ప్రారంభిస్తే... 
రెండేళ్ల క్రితం బీసీ గురుకుల సొసైటీ 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న భవనాలను అద్దెకు తీసుకుంది. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు క్లాసులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది తొమ్మిదో తరగతి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొత్త గురుకులాలకు భవనాలు లభించకుంటే ఇప్పుడు నడుస్తున్న భవనాల్లో ఒక భాగంలో కొత్త గురుకులాలను ప్రాథమికంగా ప్రారంభించే అంశంపై అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల్లో భవనాల లభ్యత ఆశాజనకంగా లేదు. మరోవైపు పట్టణీకరణ నేపథ్యంలో అద్దె సైతం ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే రెట్టింపు ఉంది. ఈ క్రమంలో కొత్త గురుకులాల ఏర్పాటు ఎలా ఖరారు చేయాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వచ్చే నెల రెండోవారం వరకు ప్రయత్నాలు జరిపి తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు