కరెంట్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా?: కేటీఆర్‌

11 Nov, 2023 17:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలను ఉచిత కరెంట్‌ కోసం ఖర్చు చేస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో కాంగ్రెస్‌పై, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. 

‘‘రేవంత్‌రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు. మూడు గంటల కరెంట్‌ చాలని అంటున్నారు. తెలంగాణలో ఉన్నది చిన్న, సన్నకారు రైతులే.. కాబట్టి 3 గంటల కరెంట్‌ చాలని రేవంత్‌ అంటున్నారు. రైతులకు రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 3-4 గంటలకు మించి కరెంట్‌ వచ్చిందా?. బీఆర్‌ఎస్‌ అంటే పంట కోతలు.. కాంగ్రెస్‌ అంటే కరెంట్‌ కోతలు. కరెంట్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా? ఆలోచించుకోండి’’ అని తెలంగాణ రైతులను ఉద్దేశించి కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. 

‘‘ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది. పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరగతిన పూర్తి చేసుకున్నాం. కాంగ్రెస్‌ పాలనలో రైతులు గోస పడ్డారు.  రైతులకు అండగా నిలిచిన కేసీఆర్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా?. మీటర్లు పెట్టాలని కేంద్రం బెదిరిస్తోంది. ఉచిత విద్యుత్‌ వద్దంటున్న కాంగ్రెస్‌ నేతల్ని ఊరి పొలిమేర అవతలకు తరిమి కొట్టండి’’ అని ప్రజలకు కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు