మోదీ ఆలింగనం.. భావోద్వేగంతో మందకృష్ణ కంటతడి

11 Nov, 2023 17:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మా) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టారు. శనివారం పరేడ్‌ గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. దీంతో మందకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. 

ప్రధాని మోదీ పక్కనే కూర్చున్న మందకృష్ణ.. కంటతడి పెట్టారు. అది గమనించిన ప్రధాని మోదీ.. ఆయన భుజంపై తడుతూ ఓదార్చారు. ఈ క్రమంలో ఆయన్ని మరోసారి హత్తుకుని ఓదార్చారాయన.  పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలోనే మాదిగ విశ్వరూప సభ జరిగింది. 

‘‘దశాబ్దాలుగా మమ్మల్ని మనుషులుగా చూడలేదు. మేం ఊహించని కల ఇది.  బలహీన వర్గాల నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన వ్యక్తి మోదీ. మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.  మన సమస్యలు పరిష్కరించడానికి  ప్రధానే స్వయంగా వచ్చారు. అత్యంత వెనుకబడిన మాదిగలకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దళితుడ్ని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది. రెండోసారి అధికారం చేపట్టాక ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు.  సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం’’ అని మందకృష్ణ ఈ వేదికపై భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన కుర్చీలోంచి లేచి సభకు హాజరైన జనసందోహంను చూస్తూ వంగి నమస్కరించారు.

మరిన్ని వార్తలు