ముహూర్తం @11:14

12 Oct, 2017 13:13 IST|Sakshi
కలెక్టరేట్‌ భవన నిర్మాణ భూమిపూజకు జరుగుతున్న ఏర్పాట్లు

కొత్త కలెక్టరేట్‌కు నేడు శంకుస్థాపన

భూమిపూజ చేయనున్న అబ్కారీ మంత్రి పద్మారావు

ఏర్పాట్లను పూర్తిచేసిన యంత్రాంగం

2019 నాటికి అందుబాటులోకి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉదయం 11:14 గంటలకు కొత్త కలెక్టరేట్‌కు పునాదిరాయి పడనుంది. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో ప్రతిపాదిత భవన సముదాయ నిర్మాణ పనులకు రాష్ట్ర ఎక్సయిజ్‌ శాఖ మంత్రి పద్మారావు శంకుస్థాపన చేయనున్నారు. సర్వే నంబర్‌ 300లో గతంలో రైస్‌హబ్‌కు కేటాయించిన భూమిలో 40 ఎకరాలను కలెక్టర్‌ కాంప్లెక్స్‌కు ప్రభుత్వం స్థల కేటాయించింది. కాగా, భూమి పూజ జరిగే స్థలంలో భూమి చదును పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లను కేటాయించింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసినందున.. నిర్మాణ పనులు వేగం అందుకోనున్నాయి. ఏడాదిలోపు ఈ భవనాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, 2019 ఎన్నికల నాటికి దీన్ని ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కొంగరకలాన్‌లో జిల్లా పరిపాలనాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయంపై కినుక వహించిన కొందరు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు గురువారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారా? లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ప్రత్యేకతలివే..
నూతన కలెక్టరేట్‌ ముఖద్వారం ఉత్తర దిశ ఉండనుంది. గ్రౌండ్‌ + 2 అంతస్తుల్లో 1.50 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో సమీకృత భవనాన్ని నిర్మించనున్నారు. సువిశాలమైన కాన్ఫరెన్స్‌ హాల్‌లు, ప్రతి విభాగానికి ప్రత్యేక ఛాంబర్లు, వందల సంఖ్యలో వాహనాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్‌ ఏరియా, క్యాంటీన్, పచ్చిక బయలు, విశాలమైన అంతర్గత రోడ్లు, ప్రహరీ, రక్షణ కోసం ప్రహరీపై విద్యుత్‌ కంచె, ప్రజల సౌకర్యార్థం వెయింటింగ్‌ రూమ్‌ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. అంతేగాక విద్యుత్‌ అవసరాల కోసం సౌర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి పూర్తిగా పర్యావరణ హితంగా కలెక్టరేట్‌ను నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తికాగానే జిల్లా కార్యాలయాలన్నీ ఇక్కడే కొలువుదీరుతాయి. తద్వారా ప్రజలకు ఒకే చోట అన్ని విభాగాల ద్వారా సేవలు అందుబాటులోకి రానున్నాయి.  

నిర్మాణ వ్యయం : రూ.35 కోట్లు
వైశాల్యం : 1.50 లక్షల చదరపు అడుగులు
నిర్మాణం : గ్రౌండ్‌ + 2 అంతస్తులు

మరిన్ని వార్తలు