మధుమేహ నియంత్రణకు కొత్త మార్గం

22 Nov, 2019 04:58 IST|Sakshi
సెక్రెటాగోగిన్‌  ప్రొటీన్‌ను కనుగొన్న సీసీఎంబీ శాస్త్రవేత్తల బృందం

ఆవిష్కరించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: మధుమేహాన్ని నియంత్రించేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ శాస్త్రవేత్తలు ఓ కొత్త మార్గా న్ని ఆవిష్కరించారు. ఊబకాయం వల్ల మధుమేహం వచ్చిన వారిలో ఇన్సులిన్‌ పనిని సెక్రెటాగోగిన్‌ అనే ప్రొటీన్‌ ఎక్కువ చేస్తున్నట్లు డాక్టర్‌ యోగేంద్ర శర్మ, ఆనంద్‌ శర్మ, రాధిక ఖండేల్వాల్, అమృతా చిదానందలు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ అతుక్కుపోవడం వల్ల ఇన్సులిన్‌కు రక్షణ కలుగుతోందని, స్థిరంగా ఉండేలా చేయడం ద్వారా పనితీరును మెరుగుపరుస్తోందని వీరు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. మధుమేహుల్లో ఈ ప్రొటీ న్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఊబకాయంతో ఉన్న ఎలుకలకు ఈ ప్రొటీన్‌ను అందించినప్పుడు కొవ్వు తగ్గడంతోపాటు రక్తంలో తిరుగుతున్న అదనపు ఇన్సులిన్‌ను తొలగించింది. అంతేకాకుండా ఈ ప్రొటీన్‌ను అందుకున్న ఎలుకల్లో హానికారక ఎల్డీఎల్‌ కొవ్వు కూడా తగ్గిపోయిందని, కాలేయ కణాల్లో కొవ్వులు పేరుకుపోవడమూ తగ్గిందని డాక్టర్‌ యోగేంద్ర శర్మ తెలిపారు. సాధారణంగా మధుమేహం, మతిమరుపు మధ్య సంబంధం ఉంటుందని, అల్జీమర్స్‌ రోగుల మెదళ్లలో ఈ సెక్రెటాగోగిన్‌ప్రొటీన్‌ తక్కువ మోతాదుల్లో ఉండటాన్ని బట్టి తాము కొన్ని ఇతర ప్రయోగాలు చేశామని ఆయన వివరించారు. సెక్రెటాగోగిన్‌ప్రొటీన్‌ అల్జీమర్స్‌ వంటి అనేక నాడీసంబంధిత సమస్యలకు కారణమయ్యే ఆల్ఫా సైనూక్లియన్‌ ప్రొటీన్‌ ఫిబ్రిల్స్‌ ఏర్పడటాన్ని నిరోధిస్తున్నట్లు ఈ ప్రయోగాల ద్వారా తెలిసిందని వివరించారు. మధుమేహ నియంత్రణకు ఈ ప్రొటీన్‌ సరికొత్త మార్గం కాగలదని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు