హైవేలపై మరణిస్తే ప్రత్యేకంగా పరిహారం లేదు 

19 Jun, 2020 08:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జాతీయ రహదారులపై ఒక మనిషి రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఏటా పెరిగిపోతోంది. వీటిలో కుటుంబ పెద్దలు మరణిస్తే.. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారం ఉండదని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తెలిపింది. జాతీయ రహదారులపై ఏటా ఎంతమంది చనిపోతున్నారు? ఎంత మంది వికలాంగులుగా మారుతున్నారు? పరిహారం ఎంతమందికి ఇస్తున్నారు? టోల్‌గేట్ల రుసుములో ఏమైనా బీమాను కలుపుతున్నారా? అన్న ప్రశ్నలతో సూర్యాపేటజిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్‌ సమాచార హక్కు కింద చేసిన దరఖాస్తుకు ఎన్‌హెచ్‌ఏఐ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పింది.

టోల్‌గేట్‌ రుసుము ద్వారా వసూలు చేసిన డబ్బులో ఎలాంటి బీమా రుసుము వసూలు చేయడంలేదని, జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినపుడు వైద్యసదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపింది.అది విధానపరమైన నిర్ణయమని, అలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఎలాంటి బీమా, నష్టపరిహారం ఇవ్వడం లేదని సమాధానం ఇచ్చింది. కానీ, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకంలో రూపే డెబిట్‌ కార్డు కలిగినవారికి ప్రమాదబీమా రూ.లక్ష వర్తిస్తుందన్నారు. అలాగే, మోటారు వాహన సవరణ చట్టం 2019 ప్రకారం.. జాతీయ రహదారులపై అంబులెన్స్‌ సౌకర్యంతోపాటు, తీవ్ర ప్రమాదాల్లో గాయపడ్డవారికి (గోల్డెన్‌ అవర్‌) నగదు రహిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల వల్ల పలు రైతు, కూలీల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పల్లెటూళ్లలో ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురినీ సైతం ప్రమాదాలు బలితీసుకుంటున్న ఉదంతాలు ఉన్న సంగతి పలువురికి విదితమే. (బుల్‌డోజర్లతో నదీ ప్రవాహం మళ్లింపు!)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు