కాన్పుల్లో కోతలకే మొగ్గు !

26 Apr, 2018 08:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వాస్పత్రిలో పెరుగుతున్న సిజేరియన్లు

సాధారణం కంటే డబుల్‌

ఆందోళన కలిగిస్తున్న కోతలు

మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

పట్టించుకోని ఉన్నతాధికారులు 

సాక్షి, జగిత్యాల: నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన సర్వే వివరాలు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సైతం సీరియస్‌ అయ్యారు. కలెక్టర్‌ సైతం వైద్యాధికారులతో సమావేశమై.. జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ప్రతీ నెల రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య తగ్గింది.
 

కేసీఆర్‌ కిట్‌తో..
కేసీఆర్‌ కిట్‌ అమలుతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య ఘననీయంగా పెరిగింది. అయితే ప్రభుత్వ వైద్యులు సైతం సాధారణ ప్రసవాల కోసం చూడకుండా ఆపరేషన్‌లు చేసేస్తున్నారు. ఈ సంవత్సరంలోనే 65 శాతం సిజేరియన్లు జరిగినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. మొదటి కాన్పు సిజేరియన్‌ చేస్తే..రెండో కాన్పు సైతం సాధారణం ఇబ్బందవుతుందని, సిజేరియన్‌ చేయాలంటున్నారు వైద్యులు. కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగినప్పటికీ.. ఇక్కడికి వస్తున్న వారిలో ఎక్కువ శాతం రెండో కాన్పుకోసమేనని వైద్యులు పేర్కొంటున్నారు.  

పలు సమస్యలు
సిజేరియన్‌ చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రోజులు కదలకుండా ఉండడంతోపాటు నొప్పి తీవ్రంగా ఉంటుంది. పుట్టిన పాపకు పాలు పట్టడంలో జాప్యమవుతుంది.  సాధారణ ప్రసవంతో పొట్టపై ఎలాంటి కోతలు ఉండవు. బాలింత మరుసటి రోజే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డకు సైతం ఇబ్బంది లేకుండా పట్టవచ్చు.   

వైద్యుల కొరతే కారణమా?
జిల్లాలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. జగిత్యాల ప్రధాన ఆస్పత్రిలో ముగ్గురే గైనకాలజిస్ట్‌లు ఉన్నారు. మెట్‌పల్లిలో ఇద్దరు, కోరుట్ల, రాయికల్, ధర్మపురిలో ఒక్కొక్కరి చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యులు ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం పరిశీలించి సాధారణ ప్రసవం చేసే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతోనే సిజేరియన్‌లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అత్యధికంగా నెలకు 400 వరకు ప్రసవాలు జరిగే జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో ఇబ్బందికరంగా మారింది. దీంతో పాటు ఇటీవల రాయికల్‌ ఆస్పత్రిలో ఒకేరోజు 24 సిజేరియన్లు చేశారు. నిబంధనల ప్రకారం ఒక్క గైనకాలజిస్ట్‌ ఉన్నప్పుడు ఒకే రోజు అన్ని చేయడం ప్రమాదకరం. సమస్య లేకపోవడంతో ఇబ్బంది తలెత్తలేదు.  

ముహూర్తాలపై నమ్మకంతో..  
చాలా మంది ముహూర్తాలపై నమ్మకంతో కోరుకున్న సమయంలో పిల్లలు పుట్టాలనే ఉద్దేశంతో టైం చూసుకుని మరీ సిజేరియన్‌లు చేయిస్తున్నారు. పురోహితులను సంప్రదించి తేదీ, సమయం తెలుసుకుని ఆపరేషన్‌ చేయించుకుంటున్నారని తెలుస్తున్నాయి.  

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచుతాం  
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ఎక్కువగా మొదటి కాన్పు సిజేరియన్‌ అయిన వారే ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో తప్పకుండా రెండో కాన్పుకు సైతం సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది. మొదటిసారి వచ్చిన వారికి సాధారణ కాన్పు అయ్యేలా వైద్యులు చూస్తున్నారు. అయినా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూస్తాం.  
– జైపాల్‌రెడ్డి, డెప్యూటీ డీఎంహెచ్‌వో 

మరిన్ని వార్తలు