రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు: తలసాని

14 May, 2016 02:01 IST|Sakshi
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు: తలసాని

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకలేదని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. పశుసంవర్థక శాఖ పరిధిలో ఉన్న వివిధ సొసైటీల ప్రతినిధులతో శుక్రవారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వెటర్నరీ పోస్టుల భర్తీని శాఖాపరంగా నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. నెలకో జిల్లా పర్యటిస్తానని, ఈ నెల 18న నల్లగొండ జిల్లాలో పర్యటించి వివిధ సొసైటీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నారు.

కులానికి 10 సంఘాలు కాకుండా ఎన్నికలు నిర్వహించుకుని ఒక జిల్లాలో ఒకటే వృత్తి సంఘం నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) ద్వారా గొర్రెలు, మేకల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. రూ.48.35 కోట్లతో మత్స్య శాఖ పరిధిలోని 4,695 చెరువుల్లో నీటి విస్తీర్ణం ఆధారంగా చేపల విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు. రూ.16.48 కోట్లతో 100 యూనిట్లలో కేజ్ కల్చర్ పద్దతిన చేపల పెంపకం చేపడతామన్నారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు