ఎనీ టైమ్‌ మూత

24 Nov, 2018 08:06 IST|Sakshi
డబ్బుల్లేని లక్ష్మీవిలాస్, ఇండియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలు

ఆదిలాబాద్‌టౌన్‌: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని రెండేళ్లు దాటినప్పటికీ ఇంకా నోట్ల కష్టాలు తీరడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. 2016 నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ప్రజలు పగలనకా రాత్రనకా ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి అంతగా లేనప్పటికీ ఏటీఎం కేంద్రాలు ‘నో క్యాష్‌’ బోర్డులతో దర్శనమి స్తున్నాయి.

మరికొన్ని కేంద్రాల్లో నామ్‌కే వాస్తేగా డబ్బులు ఉన్నప్పటికీ ఏటీఎం మిషన్లు మొరాయిస్తున్నాయి. సాంకేతిక సమస్య కారణంగా వినియోగదారులు అందులో నుంచి డబ్బులను తీసుకోలేకపోతున్నారు. నెల మొదటి, రెండో వారాల్లో వేతనాలు తీసుకునేందుకు ప్రజలు పట్టణ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్ల కోసం చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ కేంద్రంలో డబ్బులు ఉంటే అక్కడ గంటల కొద్ది బారులు తీరాల్సిన దుస్థితి దాపురించింది. ఇన్ని అవస్థలు ఎదుర్కొంటున్నా సంబంధిత బ్యాంక్‌ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో..
ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 70 వరకు ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలో వివి ధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాలు 55 వరకు ఉండగా, మిగతా 17 మండలాల్లో 15 ఏటీఎం సెంటర్ల వరకు ఉన్నాయి. ఇందులో నుంచి సగానికి పైగా ఏటీఎం కేంద్రాల్లో ఎప్పుడు నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగా అప్పటి నుంచి కొన్ని ఏటీఎంలలో ఆయా బ్యాంకుల యాజమాన్యాలు డబ్బులు వేయడం లేదని తెలుస్తోంది. దాదాపు ఓ 20 కేం ద్రాల్లో ఎప్పుడు చూసినా జనాలతో రద్దీగా కనిపిస్తున్నాయి. మరో పది ఏటీఎం కేంద్రాల్లో మిషన్లను తొలగించగా, మిగతా కేంద్రాలు సాకేంతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో వినియోగదారులకు ఇది శాపంగా మారింది.

నో క్యాష్‌ బోర్డులు
ఆదిలాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ ప్రాంతంలో గల వివిధ బ్యాంకుల ఏటీఎం కేంద్రాలు ఎప్పుడు చూసినా మూసివేసి కనిపించడం, నోక్యాష్, అండర్‌ రిపేర్‌ అనే బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఆ బోర్డులను చూసి వేరే కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడ కూడా ఏదో ఒక సమస్యతో ఏటీఎం కేంద్రం పనిచేయకపోవడంతో పట్టణమంతా ఓ రౌండ్‌ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ కేంద్రంలో డబ్బులు ఉన్నాయో తెలుసుకొని అక్కడికి వెళ్లే సరికి జనాలు బారులు తీరడం, గంటల కొద్ది సమయం వెచ్చించి మరీ డబ్బులు డ్రా చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత బాగున్నప్పటికీ పల్లె ప్రాంతాల్లోనైతే కేంద్రాలు ఎప్పుడు చూసినా మూసివేసి ఉంటున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు చేరుకొని పైసలు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ సైతం వారికి తిప్పలు తప్పడంలేదు.

పండుగలొస్తే.. పైసల పరేషాన్‌
పండుగలు, సెలవు రోజులు ఉంటే ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు లేక జనాలు అవస్థల పాలవుతున్నారు. పండుగ కోసం డబ్బులు తీసుకుందామని వచ్చేవారికి ఈ కేంద్రాలు నిరాశకు గురిచేస్తున్నాయి. బ్యాంకులు కూడా సెలవు రోజుల్లో పనిచేయకపోవడంతో ప్రజలకు పైసల కష్టాలు తప్పడంలేదు. తమతమ ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా డబ్బులు డ్రా చేసుకోలేక, పండుగల సమయంలో ఏ వస్తువులు కొనుగోలు చేసుకోలేక మనోవేదనకు గురవుతున్నారు.

సమస్య పెరుగుతోంది
ఏటీఎం సెంటర్లు నో క్యాష్‌ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. అత్యవసర సమయంలో డబ్బుల కోసం వెళ్తే ఊరంతా తిరగాల్సి వస్తోంది. ఏ ఏటీఎం కేంద్రంలో డబ్బులు ఉన్నాయో స్నేహితుల ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్తున్నాం. అక్కడ సైతం భారీ సంఖ్యలో ప్రజలు ఉండడంతో లైన్‌లో నిలబడి మరీ డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. రోజులు గడిచిన కొద్దీ నోట్ల సమస్య పెరుగుతూనే ఉంది. సంబంధిత అధికారులు స్పందించి వినియోగదారుల నోట్ల కష్టాలను తీర్చాలి. – గజేందర్, ఆదిలాబాద్‌ 

నోట్ల సమస్యలో మార్పు లేదు
గత రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. కానీ ఇప్పటివరకు కూడా నోట్ల సమస్య మాత్రం తీరడంలేదు. ఏ ఏటీఎం కేంద్రానికి వెళ్లి ఏదో కారణంగా డబ్బులు డ్రా చేసుకోలేకపోతున్నాం. కొన్ని కేంద్రాలైతే అసలు తెరుచుకోవడంలేదు. సమస్యను ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. బ్యాంక్‌ అధికారులకు చెబితే స్పందించడంలేదు. నోట్ల కష్టాలతో సతమతం అవుతున్నాం. – వృకోధర్, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు