ఆదిలాబాద్‌ @ 16.7 

9 Nov, 2023 01:40 IST|Sakshi

రాష్ట్రంలో క్రమంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు 

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి బలంగా గాలులు 

ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు గాలులతో పెరుగుతున్న చలి 

మూడురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత క్షీణించే అవకాశం 

రానున్న రెండ్రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతోనే చలి తీవ్రత మొదలవుతుంది. కానీ ఈసారి ఈశాన్య రుతుపవనాల రాక ఆలస్యం కావడం... వాతావరణంలో నెలకొన్న మార్పులతో కొంత కాలంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ వచ్చాయి. మధ్యలో రెండు మూడురోజులు చలి పెరిగినా తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు క్షీణించడం ప్రారంభించాయి.

పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండడం, రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండడంతో చలి పెరుగుతోంది. మరో మూడురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఖమ్మంలో 34 డిగ్రీ సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌లో 16.7 డిగ్రీ సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఆదిలాబాద్‌తో పాటు మెదక్, నల్లగొండల్లో చలి పెరిగింది. రానున్న మూడురోజులు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ తర్వాత మరింత తగ్గుతాయని చెబుతున్నారు. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే సమయంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

మరిన్ని వార్తలు