కాంగ్రెస్‌ అరవై ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

14 Nov, 2018 14:40 IST|Sakshi
హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న బీజేపీ నాయకులు

ప్రజల కళ్లకు గంతలు కట్టలేరు

గజ్వేల్‌ అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్దాం

మీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు  

గాంధీ భవన్‌కు రక్షణగా బౌన్సర్లా...?  

కాంగ్రెస్‌ తీరుపై మంత్రి హరీశ్‌ మండిపాటు

సాక్షి, గజ్వేల్‌: కాంగ్రెస్‌ అరవై ఏళ్ల పాలనలో ఎరువులు, విత్తనాల కొరత, కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు, గుంతలమయమైన రోడ్లు, తెర్లుతెర్‌లైన చెరువుల తప్ప అభివృద్ధి శూన్యమని... మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో బీజేపీకి చెందిన గజ్వేల్‌ మండల అధ్యక్షుడు విక్రమచారి, పట్టణశాఖ అధ్యక్షుడు బొల్లిబొత్తుల శ్రీను, మర్కూక్‌ మండల అధ్యక్షుడు చిలుక రాంచంద్రం, వర్గల్‌ మండల అధ్యక్షుడు శ్రీమంతుల లక్ష్మణాచారి, ములుగు మండల అధ్యక్షుడు మధులతో పాటు అనంతరావుపల్లి, రిమ్మనగూడ గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా... వారికి పార్టీ కండువాలను కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ చేసిన అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములమవుతామని బీజేపీ నాయకులు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. అయితే మనకు పోటీ అంటే ప్రతిపక్ష నాయకుల డిపాజిట్‌ గల్లంతు చేయడమేనన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చెవులకు పువ్వులు పెట్టుకుంటరేమో కానీ... ప్రజల కళ్లకు గంతలు కట్టలేరన్నారు. గజ్వేల్‌లో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పట్టుకునే ఆడపడుచుల కళ్లకు గంతలు కట్టి నీళ్లు రావట్లేదని దాయగలుగుతారా... అంటూ ప్రశ్నించారు. గ్రామగ్రామాన మహిళా భవనం, బీటీ రోడ్లు, ఎక్కడ చూసినా హరితహారం కింద పెరుగుతున్న పచ్చని చెట్లు, ప్రతి గ్రామంలో మిషన్‌ కాకతీయ కింద చెరువు, కుంటల పునర్జీవం పోసుకున్నాయన్నారు. అంతేగాకుండా మరెన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పాండవుల చెరువుపై పెరిగిన సర్కారు తుమ్మలు, మనిషి నడవరాకుండా చేసిన రోడ్డు... కానీ ఇప్పుడు అదే పాండవుల చెరువుపై నిలబడి చూస్తే అభివృద్ధి అంటే ఎంటో అర్థమైతదన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో కరెంటు లేక పరిశ్రమల మూత, రోడ్లు బాగలేక బస్సులు, ఆటోలు బందు, మంచినీళ్ల కోసం ట్యాంకర్ల ముందు మహిళల కొట్లాటలు తప్ప ఇంకేం లేదన్నారు. 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ నాయకులు కాదా... అన్నారు. ప్రజల్లోకి వెళ్లి... మీ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని మీరు చెప్పండి... 2014 నుంచి 2018 దాకా మా నాలుగేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని మేం చేబుతామని పేర్కొన్నారు. ఇక గాంధీభవన్‌ దగ్గర పరిస్థితి చూస్తే కుర్చీలు విరుగుతున్నయ్‌.. తలుపులు పగులుతున్నయ్‌... దిష్టిబొమ్మలు కాలుతున్నయ్‌... గాంధీభవన్‌ను తగలబెడ్తరో.. పగలగొడ్తరో అని... రక్షణగా పహిల్వాన్‌లను... బౌన్సర్లను పెట్టుకున్నరు. ఇది కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.

ఇక్కడి బీజేపీ నాయకులు కూడా గజ్వేల్‌ అభివృద్ధిలో భాగస్వాములమవతామని టీఆర్‌ఎస్‌లోకి రావడం అభినందనీయమన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఓట్ల కోసం తోడుదొంగల్లా వస్తున్న ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డిలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, నాయకులు ఆకుల దేవేందర్, ఊడెం కృష్ణారెడ్డి, ఎన్‌సీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు