దుక్కుల్లేని పల్లెలు

25 Jul, 2019 01:18 IST|Sakshi

లోటు వర్షపాతంతో కదలని నాగలి.. భారీగా తగ్గిన సాగు.. 

ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు 44 శాతమే.. 

రాష్ట్రంలో 448 మండలాల్లో వర్షాభావం 

10 రోజుల్లో వర్షాలు పడకుంటే సాగైన పంటల్లో బతికేది 30 శాతమే

కాలం అదును తప్పింది. నేల పదును తప్పింది. వర్షం మొండికేయడంతో మొలకలు ఎండిపోయి చెలక చిన్నబోయింది. తడారిన పొలాలు  ఎడారిలా మారాయి. వర్షాభావం కారణంగా సాగుబడి అటకెక్కింది. దీంతో రానున్న రోజుల్లో తిండి గింజకోసం తిప్పలు తప్పేట్లు లేవు. ఆహారధాన్యాలు మరీ ముఖ్యంగా వరి సాగు అత్యంత దారుణ స్థితికి పడిపోయింది. ఖరీఫ్‌ పంటల సాగు నిరాశాజనకంగా మారింది. సీజన్‌ మొదలై 2 నెలలవుతున్నా.. వానదేవుడు కరుణించకపోవడంతో 33 జిల్లాలకుగాను 28 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. ఖమ్మం జిల్లాలోనైతే ఏకంగా కరువు ఛాయలు నెలకొన్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా 37% లోటు వర్షపాతం నమోదవడంతో ఈసారి ఖరీఫ్‌ గట్టెక్కుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఈసారి తిండి గింజలకూ కరువు తప్ప దని రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 68.62 లక్షల (63%) ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అందులో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఖరీఫ్‌ ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.25 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 21.05 లక్షల ఎకరాల్లోనే సాగు కావడం ఆందోళన కలిగిస్తుంది. అంటే కావాల్సిన దానిలో 44 శాతానికే పరిమితమైంది. అందులో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, కేవలం 5.32 లక్షల (22%) ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి.

ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, కేవలం 7.30 లక్షల (58%) ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, కేవలం 7.56 లక్షల (73%) ఎకరాల్లోనే సాగయ్యాయి. వరి సహా ఇతరత్రా ఆహారధాన్యాలు పండకపోతే తినడానికీ కష్టమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. సన్నచిన్నకారు రైతులైతే తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒక్క పత్తి సాగు మాత్రమే అత్యధికంగా సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 39.69 లక్షల (92%) ఎకరాల్లో సాగైంది. అయితే అనేకచోట్ల వర్షాలు లేక భూమిలోనే పత్తి మాడిపోతోంది. కొన్ని మొలకలు వచ్చినా వర్షాలు లేక అవి ఎండిపోతున్నాయని రైతులు అంటున్నారు. 

16 జిల్లాల్లో సగటు కంటే తక్కువే 
రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటల సాగు సగటు విస్తీర్ణం 63% కాగా, 16 జిల్లాల్లో అంతకంటే తక్కువగా సాగు కావడం గమనార్హం. రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, వనపర్తి, గద్వాల, సూర్యాపేట, యాదాద్రి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ములుగు జిల్లాలోనైతే కేవలం 21% మాత్రమే పంటలు సాగయ్యాయి. వనపర్తి జిల్లా 22 శాతానికే పరిమితమైంది. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రమే నూటికి 100% పంటలు సాగు కావడం విశేషం. 
 
448 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు 
రాష్ట్రంలో 589 మండలాలు ఉంటే అందులో 448 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో 83 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయని సర్కారు నివేదికే చెబుతోంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 31 జిల్లాలుంటే, అత్యధికంగా 27 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దారుణం. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలుంటే, అన్నీ వర్షాభావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 21 మండలాలుంటే, ఏకంగా 20 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలుంటే, అన్నింటిలోనూ వర్షాభావమే నెలకొంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోనూ 11 మండలాలుంటే, అన్నింటిలోనూ వర్షాభావమే నెలకొంది. మహబూబాబాద్, వరంగల్‌ రూరల్, ములుగు జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ వర్షాభావమే నెలకొంది. జూన్, జులై నెలల్లో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 317.2 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 200.2 మి.మీ. మాత్రమే నమోదైంది.

అంటే 37% లోటు నమోదైంది. దీంతో పంటలు సాగు చేసిన చోటే ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరో వారం పది రోజుల్లో వర్షాలు కురవకపోతే 30 శాతానికి మించి పంటలు చేతికి వచ్చే పరిస్థితి ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గద్వాల, సిరిసిల్ల జిల్లాల్లో పత్తిపై గులాబీ పురుగు దాడి చేస్తుంది. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, ఖమ్మం, కరీంనగర్, నిర్మల్‌ జిల్లాల్లో మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. ఒకవైపు వర్షాభావం నెలకొంటే, మరోవైపు ఇలాంటి పురుగుతో పంటలకు పెనునష్టం సంభవిస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం భరోసా ఇస్తుండటంతో ఆశలు చిగురిస్తున్నా, అదును దాటాక వర్షాలు కురిస్తే ప్రయోజనమేంటన్న భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. 

మేఘం అలక 
చినబోయిన చెలక 
దిగాలుపడె రైతన్న కూలీ లేక 
పట్నం బాట పట్టాడు ఊరిలో బతకలేక 

మరిన్ని వార్తలు