నామినేషన్ల జోరు

15 Nov, 2018 15:42 IST|Sakshi

మూడోరోజు దాఖలైన 14 నామినేషన్లు

పటాన్‌చెరులో అత్యధికంగా ఐదుగురు

సంగారెడ్డి మినహా అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌..

ఖరారు కాని సీట్లలోనూ నేతల నామినేషన్లు

19న ఖేడ్, అందోలు నామినేషన్లకు హరీశ్‌ రాక

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా మూడో రోజు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన అత్యధికంగా ఆరుగురు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. సంగారెడ్డి మినహా మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యధికంగా ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా వీరిలో ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారే ఉన్నారు. పటాన్‌చెరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్‌గౌడ్‌ తరపున ఆయన భార్య సుధారాణి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో నేత సపాన్‌దేవ్‌ తరపున ఆయన అనుచరుడు పరీదుద్దీన్‌ నామినేషన్‌ వేశారు. ఇదే స్తానం నుంచి అమీన్‌పూర్‌ మాజీ సర్పంచ్‌ గోక శశికళ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు మహాకూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ పక్షాన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఒకేరోజు నలుగురు నేతలు నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. కాగా కాంగ్రెస్‌ పక్షాన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అందోలు నియోజకవర్గం నుంచి, జహీరాబాద్‌ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి నామినేషన్లు వేశారు. 

పార్టీ    అభ్యర్థులు
టీఆర్‌ఎస్‌     04
కాంగ్రెస్‌       06
టీడీపీ         01
బీజేపీ        01
బీఎల్‌పీ     01
స్వతంత్ర    01
 
ఖేడ్‌లో సంజీవరెడ్డి నామినేషన్‌
నారాయణఖేడ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ పక్షాన మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్, ఎంపీపీ సంజీవరెడ్డి ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు టికెట్‌ కేటాయింపుపై స్పష్టత రాకున్నా, ఎంపీపీ సంజీవరెడ్డి తరపున ఆయన సోదరుడు సుధాకర్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులెవరూ ముందుకు రాకపోగా, స్వతంత్ర అభ్యర్థిగా పోలీసు రామచంద్రయ్య నామినేషన్లు వేశారు. అందోలు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

టీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు
సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌ మినహా ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇప్పటికే ఖరారైన నలుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బుధవారం నామినేషన్‌ వేశారు. పటాన్‌చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌ నుంచి కోనింటి మాణిక్‌రావు, నారాయణఖేడ్‌ నుంచి భూపాల్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అందోలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌ తరపున ఆయన సోదరుడు రాహుల్‌ నామినేషన్‌ సమర్పించారు. ఈ నెల 19న నారాయణఖేడ్, అందోలు అభ్యర్థులు భారీ ర్యాలీతో నామినేషన్‌ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా మంత్రి హరీశ్‌రావు హాజరు కానున్నారు.


 

మరిన్ని వార్తలు