తెలుగు రాష్ట్రాల్లో ‘ఎమ్మెల్సీ’ నగారా

8 May, 2015 01:59 IST|Sakshi
తెలుగు రాష్ట్రాల్లో ‘ఎమ్మెల్సీ’ నగారా

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూలు విడుదల చేసిన ఈసీ
ఏపీలో 4 స్థానాలకు,  తెలంగాణలో 6 స్థానాలకు ఎన్నిక
14న నోటిఫికేషన్ జారీ
ఇరు రాష్ట్రాల్లోనూ జూన్ 1న ఎన్నిక
 అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు

 
రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలిదీ...
మే 14  నోటిఫికేషన్ విడుదల
మే 21 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు
మే 22  నామినేషన్ల పరిశీలన
మే 25  నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు
జూన్ 1 పోలింగ్ తేదీ
జూన్ 1 ఓట్ల లెక్కింపు (సాయంత్రం 5 గ॥
పోలింగ్ సమయం :  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
 
ఎమ్మెల్యేల మద్దతుపై పార్టీల్లో తీవ్ర చర్చ టీఆర్‌ఎస్‌కు 4, కాంగ్రెస్‌కు ఒక స్థానం ఖాయం
 
హైదరాబాద్: శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాష్ర్టంలో రాజకీయ సమీకరణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ సీట్లకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నందున పార్టీల బలాబలాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య(ఓట్లు) ఆధారంగా ఆయా పార్టీలు గెలుచుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆధారపడి ఉంటాయి. శాసనసభలోని మొత్తం స్థానాల సంఖ్యను, ఖాళీ స్థానాల(ఎన్నిక జరగాల్సిన సంఖ్య)తో భాగించి ఒక్కో ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు అవసరమో లెక్క తేలుస్తారు. ఆ సమీకరణల మేరకు ప్రస్తుతం ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఒక్కో ఎమ్మెల్సీకి 18 ఎమ్మెల్యే ఓట్లు అవసరమవుతాయి.

టీఆర్‌ఎస్‌కు నాలుగు ఎమ్మెల్సీలు

అధికార టీఆర్‌ఎస్ ఎలాంటి సమస్య లేకుండా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంతో ఆ పార్టీ బలం అధికారికంగానే 65కు చేరింది. ఇక కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు కలిపి మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్ గూటికి చేరారు. దీంతో పార్టీకి 75 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్కో ఎమ్మెల్సీకి 18 ఓట్ల చొప్పున చూస్తే టీఆర్‌ఎస్ స్థానంలో నాలుగు స్థానాలు ఖాయం. అయితే, ఐదో ఎమ్మెల్సీని గెలుచుకోవాలంటే మాత్రం మరో 15 మంది మద్దతు అవసరం. టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్న ఎంఐఎం చేతిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసినా పార్టీకి మిగిలే ఓట్ల సంఖ్య పదికి చేరుకుంటుంది. అయినా మరో 8 మంది మద్దతు అవసరం. ఈ విషయంలో పార్టీ నాయకత్వమూ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌కు ఒకటి ఖాయం

శాసనసభలో బలాబలాల దృష్ట్యా కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో ప్రస్తుతం ఆ పార్టీకి 17 మంది మాత్రమే మిగిలారు. కానీ, వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతుండడంతో ఆ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. దీంతో కాంగ్రెస్‌కు తగినన్ని ఓట్లు ఉన్నట్లేనని, ఒక ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం ఖాయమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
 
ప్రశ్నార్థకంగా టీడీపీ
 
టీడీపీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ చేతిలో 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మిత్రపక్షమైన బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో టీడీపీ ఓట్ల సంఖ్య 16కు చేరుతోంది. ఎమ్మెల్సీని దక్కించుకోవాలంటే మరో రెండు ఓట్లు అవసరం. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కో ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు మద్దతిస్తేనే టీడీపీ ఒక స్థానమైనా గెలుచుకునే వీలుం ది. కానీ, బీజేపీతో అంటకాగుతున్న టీడీపీకి  సీపీఎం, సీపీఐ మద్దతిస్తాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు మండలిలో టీడీపీకి స్థానమే లేకుండా చేయడం కోసం టీఆర్‌ఎస్.. టీడీపీ ఓట్లను చీల్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో అధికార పార్టీకి అదనంగా అవసరమయ్యే ఓట్ల కోసం తమ వాళ్లను లాగేసుకుంటారన్న ఆందోళన టీడీపీలో మొదలైంది. ఇప్పటికే టీడీపీ నుంచి కనీసం ఆరుగురు ఎమ్మెల్యేల కోసం గాలం వేశారని, వీరిలో నలుగురు టీఆర్‌ఎస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా
 
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోటాలోని ఎమ్మెల్సీల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు, తెలంగాణలో 6 స్థానాలకు ఎన్నిక జరగనుంది. తెలంగాణలో గత మార్చి 29 నాటికి ఏడుగురు సభ్యులు పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఇందులో కె.ఆర్.ఆమోస్, నాగపూరి రాజలింగం, పీర్ షబ్బీర్ అహ్మద్, బాలసాని లక్ష్మీనారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి, డి.శ్రీనివాస్ ఉన్నారు. ఈ ఏడు స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 23-సబ్‌సెక్షన్ 1 ప్రకారం తెలంగాణ శాసన మండలికి శాసన సభ్యుల కోటాలో ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్యను 14గా నిర్ధారించారు. కానీ ఇదే చట్టంలోని షెడ్యూలు-4 కింద 15 మంది సభ్యులను కేటాయించారు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 14గా ఉండేందుకు వీలుగా కసరత్తు చేసిన హోంశాఖ ఈ మేరకు ఇప్పుడు ఖాళీ అయిన ఏడు స్థానాల్లో ఆరింటికే ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. కె.ఆర్.ఆమోస్ ఖాళీ చేసిన స్థానం ఇక రద్దయినట్లుగా పరిగణించాలి. ఈ మేరకు ఇటీవలే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూలును జారీ చేసింది.
 
ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు..

 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శాసన సభ్యులు ఎన్నుకోవాల్సిన కోటాలో మూడు స్థానాలు అదనంగా వచ్చిచేరాయి. ఈ మూడు స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. అలాగే 2017 మార్చి 29 వరకు పదవీకాలం ఉన్న ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు గత జనవరి 19న మరణించారు. దీంతో ఆ స్థానానికీ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం 4 స్థానాలకు ఎన్నిక జరగనుందని ఈసీ పేర్కొంటూ ఆ మేరకు షెడ్యూలును జారీ చేసింది.


 

మరిన్ని వార్తలు